రామన్న బడ్జెట్!
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, పీఎంకే షాడో బడ్జెట్‌ను ఆదివారం విడుదల చేసింది. అన్నదాతకు పెద్ద పీట, విద్యకు అందలం ఎక్కించే విధంగా అందులో అంశాలను పొందుపరిచారు. ఇక, స్థానిక సమరం రాష్ట్రంలో అల్లర్లకు దారి తీస్తాయని ఈసందర్భంగా రాందాసు వ్యాఖ్యానిస్తూ, ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేసేందుకు సిద్ధ పడ్డ సమయంలో పీఎంకే తరఫున షాడో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. పద్నాలుగో సారిగా ఆదివారం తాము రూపొందించిన బడ్జెట్‌ను పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు చెన్నైలో ప్రకటించారు. ఈనెల 21న రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ దాఖలును పురస్కరించుకుని, తాము సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, రాష్ర్ట ప్రగతికి దోహదకారిగా ఉంటుందని ప్రభుత్వానికి రాందాసు సూచించారు. అన్నదాతకు పెద్దపీట వేసే విధంగా, విద్యాభ్యున్నతిని కాంక్షిస్తూ, చార్జీల వడ్డన, పన్నుపోటు లేకుండా, రుణాల కేటాయింపుల మీద దృష్టి పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పెంపు దిశగా తన మాదిరి బడ్జెట్‌లో వంద అంశాలను రాందాసు పొందుపరిచారు.
ప్రధానంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల కట్టడికి పంచసూత్రాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల తరహాలో తమిళనాడులోనూ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా, ఈ ఏడాది అన్నదాతలకు ఎనిమిది వేల కోట్ల మేరకు పంట రుణాల కేటాయింపుల గురించి విశదీకరించారు. అలాగే, వ్యవసాయాభివృద్ధికి ఆ శాఖ మంత్రి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ నియమించే విధంగా సూచనలు ఇచ్చారు. విద్యావ్యాప్తి, మెరుగైన విద్య లక్ష్యంగా ఈ ఏడాది 45 వేల కోట్లు కేటాయించాల్సిన అవశ్యం ఉందని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి పెంపు పథకాలు, బస్సు చార్జీల తగ్గింపు అంశాల గురించి వివరించారు.
ఇక, ఇదివరకు ప్రకటించిన బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు, అవి ఏ మేరకు అమలు అయ్యాయో, వాటి తీరు తెన్నులను వివరించాల్సిన అవశ్యం ప్రభుత్వానికి ఉందని, అందుకు తగ్గ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్ తయారీకి ముందుగా ప్రజాభిప్రాయం స్వీకరించే విధంగా మాదిరి బడ్జెట్‌లో ప్రత్యేక సూచనలు చేశారు. గ్రామసభల నుంచి ఈ అభిప్రాయ సేకరణ సాగాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం విభాగాల వారీగా నిధుల కేటాయింపులు, వాటి అమలు తీరును వివరించే విధంగా మరో కొత్త అంశాన్ని షాడో బడ్జెట్‌తో తెరమీదకు తెచ్చారు.
అల్లర్లు తథ్యం: షాడో బడ్జెట్ ప్రకటనతో మీడియా ప్రశ్నలకు రాందాసు సమాధానాలు ఇచ్చారు. స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో తీవ్ర కల్లోలాన్ని, అల్లర్లను సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, సరే రిటర్నింగ్ అధికారులు మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించడం ఖాయం అని ఆరోపించారు. ఇందుకు తగ్గ ఆదేశాలు అధికారులకు ఇప్పటికే చేరాయని పేర్కొన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారని ధ్వజమెత్తారు. లక్షలు పోసి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల్లో అధికారుల తీరు ఆగ్రహజ్వాలను రగల్చడం ఖాయం అని, ఈ పరిణామాలు అల్లర్లకు దారి తీయడం థథ్యం అని హెచ్చరించారు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, నేతలు ఏకే మూర్తి పాల్గొన్నారు.