టీనగర్: అదృశ్యమైన కుమార్తె గురించి విచారించేందుకు వెళ్లిన తండ్రిపై ఇన్‌స్పెక్టర్ దాడి చేశారు. దీనిపై స్నేహితులు, బంధువులు నిలదీయడంతో ఇన్‌స్పెక్టర్ బహిరంగ క్షమాపణ తెలిపారు. ఈ వ్యవహారం తాంబరంలో తీవ్ర సంచలనం కలిగించింది. చెన్నై, సైదాపేటకు చెందిన మేతర్. ఇతని భార్య మేరి మృతిచెందారు. వీరి కుమార్తె అముదవల్లి (4). వీరితోపాటు మేతర్ తల్లి నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కీల్‌కట్టలైలో నివసిస్తున్న మేరి అక్క ఇంటికి అముదవల్లిని మేతర్ తల్లి తీసుకువెళ్లింది.
తాంబరానికి వెళ్లగానే మేతర్ తల్లి ఒక టాస్మాక్‌లో మద్యం తాగారు. మత్తు తలకెక్కడంతో కొద్దిసేపట్లోనే బస్టాండులోనే తూలిపోయారు. దీంతో అముదవల్లి బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో తిరిగింది. దీన్ని గమనించిన కొందరు తాంబరం పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని అముదవల్లిని రక్షించారు. ఆమెను తాంబరం సీటీవో కాలనిలోగల ఉదవుం ఉల్లంగల్ అనే అనాథాశ్రమంలో చేర్చారు. తన తల్లి, కుమార్తె మేరి అక్క ఇంట్లోనే ఉంటారని మేతర్ భావించి మిన్నకుండిపోయారు.
ఇలావుండగా మేరీ అక్కకు మేతర్ ఫోన్ చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకోలేదన్న విషయం మేతర్‌కు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను తాంబరం చేరుకుని విచారణ జరిపారు. ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో తాంబరం పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణియం వద్ద విచారణ జరిపారు. ఆయన ఏమీ ప్రశ్నించకుండా మేతర్‌పై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటికి చేరాడు. తర్వాత ఆదివారం స్నేహితుల సాయంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. మేతర్‌పై ఎలా దాడి చేస్తారని స్నేహితులు, బంధువులు ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించారు. చాలా సేపు వారి మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం ఇన్‌స్పెక్టర్ బహిరంగ క్షమాపణ కోరాడు. దీంతో ఉదవుం ఉల్లంగల్ అనాథాశ్రమంలో వున్న బిడ్డను మేతర్‌కు అప్పగించారు.