నయీం గ్యాంగ్పై బాధితురాలి ఫిర్యాదు
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ ఫిర్యాదు నమోదైంది. నయీం గ్యాంగ్ తమను బెదిరించి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు మేడ్చల్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు వరలక్ష్మీ వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో వరలక్ష్మికి 8 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని ఆమె భర్త బాలకృష్ణ 2003లో కొనుగోలు చేశాడు. అనారోగ్యంతో బాలకృష్ణ 2009లో చనిపోయాడు. అనంతరం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మేడ్చల్‌లో ఉంటోంది. అప్పటికే ఈ భూమిపై ఓ కేసు పెండింగ్‌లో ఉండగా... దీనిపై నయీం అనుచరుల కన్ను పడింది.
ఎనిమిది నెలల కిందట అంజయ్య అనే వ్యక్తి భువనగిరి రాజు, కృష్ణ అనే న్యాయవాది, మరికొందరు నయీం అనుచరులమని బెదిరించారని వరలక్ష్మీ వాపోయింది. తమ నుంచి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకుని రూ.50 వేల నగదు చెల్లించి ఆ భూమిని వారికే ఇవ్వాలన్నారని చెప్పింది. ఆ తర్వాత భువనగిరి రాజు వరలక్ష్మి మామయ్యకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని బెదిరించాడని ఆమె తెలిపింది. ఈ విషయంలో తేడా వస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.