బెంగళూరు : యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న నైట్ లైఫ్‌కు ‘జీవం’ వచ్చింది. వారమంతా రాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, తినుబండారాల దుకాణాలను, శుక్ర, శనివారాల్లో బార్లు, రెస్టారెంట్లను తెరచి ఉంచడానికి అనుమతినిస్తూ నగర పోలీసు కమిషనర్ ఇదివరకే నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
ఐటీ, బీటీ, గార్మెంట్ రంగాల్లో పేరు గడించిన ఉద్యాన నగరిలో రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తించే వారికి ఆహారం దొరకడం లేదనే ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ లైఫ్‌కు పచ్చ జెండా ఊపింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు శాఖ దీనిపై ఆది నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనేక ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నైట్ లైఫ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చిందనే ఆరోపణలూ లేకపోలేదు. ప్రయోగాత్మకంగా మూడు నెలలు చూస్తామని, ఇబ్బందులు ఎదురైతే మళ్లీ పాత వేళలే పునరావృతమవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అదనపు భారంతో పోలీసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఆసియాలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా బెంగళూరు ఖ్యాతి గడించింది. అదే నిష్పత్తిలో పోలీసుల సంఖ్య పెరగడం లేదు. నగర సాయుధ రిజర్వు, కేఎస్‌ఆర్‌పీ మినహా ప్రస్తుతం నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు 14,513 మంది పోలీసులు ఉన్నారు.
వీరంతా ఇన్‌స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ స్థాయి వారు. ఏ విధంగా లెక్క వేసినా మరో ఐదు వేల మందికి పైగా పోలీసుల అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. జన విస్ఫోటం, నేరగాళ్ల స్వైర విహారం, అస్తవ్యస్తంగా తయారవుతున్న ట్రాఫిక్ వల్ల ఇప్పటికే కంటి మీద కునుకు లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. పైగా నిత్యం విదేశీ ప్రముఖులు నగరానికి వస్తుంటారని, వారి భద్రతలో ఏ మాత్రం లోపం కనిపించినా ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూసినా నగరంలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో ఐదు నుంచి పది మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో నైట్ లైఫ్ పొడిగింపు వల్ల మద్య ప్రియులకు, వ్యాపారులకు సంతోషంగా ఉంటుందేమో కానీ పోలీసు శాఖపై ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటుందని అధికారులు వాపోతున్నారు.
ఇప్పటికే విశ్రాంతి లేకుండా సతమతమై పోతున్నామని, తాజా పరిణామం వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతుందని చెబుతున్నారు. హోం గార్డులతో రాత్రి డ్యూటీలు చేయించడానికి నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాత్రి బీట్‌లో ఉండే పోలీసులకు తోడుగా ఒక్కో హోం గార్డు ఉంటారు.