
మనస్సాక్షి లేదా?
మనస్సాక్షి లేదా...అంధులతో ఎలా వ్యవహరించాలో తెలియదా?’ అని చెన్నై పోలీసులను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. చెన్నై పోలీసుల
సాక్షి, చెన్నై:‘మనస్సాక్షి లేదా...అంధులతో ఎలా వ్యవహరించాలో తెలియదా?’ అని చెన్నై పోలీసులను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. చెన్నై పోలీసుల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబరులో అంధులు తమ డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి ఆందోళనలు చేశారు. దీక్ష రూపంలో నిరసనలు తెలిపారు. ఎవ్వరూ తమను పట్టించుకోకపోవడంతో చివరకు రోడ్డెక్కారు.
ఆ రోజు రోడ్డెక్కిన అంధులనుోలీసులు అరెస్టు చేయడం, ఆ మరుసటి రోజున మరో చోట నిరసనకు దిగడం అంధులకు దినచర్యగా మారింది. చివరకు పోలీసులు మానవత్వాన్ని మరిచే రీతిలో వ్యవహరించారు. అంధులను అరెస్టు చేసి రాజధాని నగరం నుంచి 72 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లి వదిలి పెట్టారు. దీనిపై ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఆ సమయంలో అంధులు ఎలాంటి వేదన అనుభవించి ఉంటారోనన్న విషయాన్ని చెన్నైకు చెందిన పౌరుడు మహ్మద్ నజూరుల్లా గ్రహించారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన ఓ లేఖ రాశారు.
అంధులతో పోలీసులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖను అప్పటి న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివరణ కోరుతూ చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రశ్నల వర్షం: సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ముందు ఉదయం విచారణ జరిగింది. చెన్నై పోలీసు కమిషనరేట్ తరపున న్యాయవాది మూర్తి హాజరయ్యారు. వివరణకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో చెన్నై పోలీసులను ఉద్దేశించి ప్రధాన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మనస్సాక్షి లేదా? అంధులతో ఎలా వ్యవహరించాలో తెలియదా? అంత దూరం ఎలా తీసుకెళ్లారు? ఎక్కడ వదిలి పెట్టారు? మళ్లీ వారు ఎలా రాగలిగారు? ఎంత మందిని తీసుకెళ్లారు..? ఇలా ప్రశ్నల్ని సంధించడంతో పోలీసుల తరపున న్యాయవాది ఉక్కిరిబిక్కిరి కాక తప్పలేదు. అంధులతో ఇలా వ్యవహరించవచ్చన్న నిబంధనలు ఏమైనా ఉన్నాయా?, అంధులను ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారు? ఎలాంటి సెక్షన్లు తమ వద్ద ఉన్నాయి...? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా, ఈ పిటిషన్‌కు రెండు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.