త్రిషకు రక్షణ కల్పించండి
తమిళసినిమా: తన కూతురు త్రిషకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె తల్లి ఉమ సోమవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఒక లేఖను అందించారు. గత కొద్ది రోజులుగా నటి త్రిష తమిళ ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మూగ ప్రాణుల సంరక్షణ సంస్థ పెటా అంబాసిడర్‌గా ఉన్న త్రిష జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు జల్లికట్టు మద్దతుదారులు ఆమెపై మండిపడుతున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో త్రిష గురించి ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జల్లికట్టుకు తాను వ్యతిరేకం కాదు అని, తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని త్రిష ఒక ప్రకటన ద్వారా వెల్లడించినా, ఆమెపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్న త్రిషపై ఆందోళన కారులు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు.
దీంతో ఆమె నటిస్తున్న గర్జన చిత్ర షూటింగ్ రద్దు చేసుకోవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో త్రిష తల్లి ఉమ సోమవారం ఉదయం చెన్నై కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఒక వినతి పత్రాన్ని అందించారు. అందులో తన కూతురు నటి త్రిషకు రక్షణ కల్పించాలని కోరారు. అదే విధంగా త్రిష ట్విట్టర్‌ను హ్యాక్ చేసిన వారిని కనిపెట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉమ విలేకరులతో మాట్లాడుతూ త్రిష జల్లికట్టుకు వ్యతిరేకం కాదని, అదే విధంగా తను పెటాలో సభ్యురాలు కాదని, ఆ సంస్థకు ప్రచారకర్త కూడా కాదని వెల్లడించారు.