నాసిక్: అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకుడు నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాష్ర్ట హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. స్థానిక మహారాష్ట్ర పోలీస్ అకాడమీ (ఎంపీఏ) కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్ర హంతకులను వీలైనంత త్వరగా పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం నాకుంది. ’ అని అన్నారు. సీబీఐతోగానీ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తోగానీ ఈ కేసు విచారణ జరిపించాలంటూ మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారంటూ మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా పై విధంగా స్పందించారు.
ఇటీవల కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ ఉగ్రవాది ఉస్మాని పరారైన ఘటనపై ప్రశ్నించగా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. కర్తవ్య నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఉస్మాని పారిపోగలిగాడన్నారు. బేడీలు వేయరాదని, తాళ్లతో బంధించరాదనే నిబంధనలు పోలీసుల విధులకు ఆటంకంగా పరిణమించాయన్నారు. 12 మంది ఉగ్రవాదులు రాష్ర్టంలోకి ప్రవేశించినట్టు వార్తలొచ్చాయి కదా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. గూఢచార విభాగం నుంచి ఇప్పటిదాకా 249 హెచ్చరికలొచ్చాయన్నారు. దీంతో దాడులను నిరోధించేందుకు మాల్స్, ఆలయాలు తదితర రద్దీ ప్రదేశాలను తమ శాఖ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో లాల్‌బాగ్ చా రాజా మండపం వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ తోపాటు మరో మహిళకు అవమానం జరగడంపై స్పందిస్తూ సీసీటీవీ కెమెరాలు నమోదుచేసిన దృశ్యాలను తమ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారన్నారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక చట్టం కింద కేసులు
ఇటీవలికాలంలో భవనాలు కూలిపోవడం, అనేకమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోవడంపై మీడియా ప్రశ్నించగా సంబంధిత బిల్డర్లపై మహారాష్ర్ట వ్యవస్థీకృత నేరనిరోధక చట్టం (ఎంసీఏసీఏ) కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
వందన స్వీకారం
మహారాష్ట్ర పోలీస్ అకాడమీ (ఎంపీఏ)కి చెందిన 108వ బ్యాచ్ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ పాల్గొన్న హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పోలీసు క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌లో 75 మంది మహిళా సిబ్బందితోపాటు 1,544 పోలీసు క్యాడెట్లు పాల్గొన్నారు.
హంతకుల్ని త్వరలో పట్టుకుంటాం, నరేంద్ర హత్యకేసుపై హోం మంత్రి
Published Sat, Sep 28 2013 12:00 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement