శ్యాంపిల్స్ కేసు మాఫీకి యత్నం?
► రంగంలోకి రాజకీయ నేతలు
► అధికారులపై ఒత్తిళ్లు
ఎల్.ఎన్.పేట : మండల కేంద్రంలోని శ్రీగోపాల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో మంగళవారం పట్టుబడ్డ శ్యాంపిల్స్ మందుల కేసును మాఫీ చేసేందుకు జిల్లాలో రాజకీయ నేతలు రంగంలోకి ప్రవేశించినట్టు ప్రచారం జరుగుతుంది.
మందుల దుకాణంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దాడులు చేసి రూ.3లక్షల విలువ చేసే 51 రకాల శ్యాంపిల్స్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే. వీటిని పట్టుకున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లపై పెద్ద వ్యాపారులు రాజకీయ నేతలతో ఒత్తిడి చేయిస్తున్నట్టు సమాచారం. గుట్టుగా చేసుకునే మందుల వ్యాపారాన్ని బట్టబయలు చేయడం సరికాదని అధికారుల తీరునే దుకాణదారులు తప్పుపడుతున్నట్టు తెలిసింది. మందుల వ్యాపారంలో ఇది సామాన్యమేనని దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుకాణ యజమానులు ఇతరుల వద్ద చెబుతున్నట్టు సమాచారం.
ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటున్న శ్యాంపిల్స్ విక్రయాలను బయటపడడంతో రెండు రోజులుగా మండల కేంద్రంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేసుకు సంబంధించిన అన్ని మందులను ఆమదాలవలస కోర్టులో అప్పగించడం జరిగిందని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎ.కృష్ణ సాక్షికి బుధవారం తెలిపారు.