కల నిజమవుతోంది
కలలు అందరూ కంటారు. అయితే కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. నటి పూర్ణ కూడా చిరకాల కలను ఇప్పుడు నెరవేర్చుకోబోతోందట. కేరళకు చెందిన ఈ బ్యూటీ బహుభాషా నటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో విత్తగన్, జన్నల్ ఓరం, తగరారు తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులోను పలు హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ స్వతహాగా మంచి డ్యాన్సర్. అలాంటి ఈమెకు ఒక డ్యాన్స్ స్కూల్ నెలకొల్పాలన్నది చిరకాల కోరిక. అది ఇప్పటికీ నెరవేరబోతోందన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది. దీని గురించి పూర్ణ తెలుపుతూ ఒక నృత్య పాఠశాల ప్రారంభించాలన్నది తాను చాలా కాలంగా పెంచి పోషిస్తున్న డ్రీమ్ అంది.
దాన్నిప్పుడు నెలకొల్పడానికి తన తండ్రి సాయం చేస్తున్నారని చెప్పింది. తన సొంత ఊరు కేరళలోని కున్నూర్‌లో ఈ నృత్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నటినని పేర్కొంది. అయినా పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడానికి తన కుటుంబం ప్రోత్సహించిందని చెప్పింది. తొలుత నృత్యానికే పరిమితమైన తాను ఆ తరువాత రియాలిటీ షోలకు అక్కడి నుంచి సినీ రంగ ప్రవేశం చేశానని తెలిపింది. పలు స్టేజీ ప్రదర్శనలు కూడా చేశానని చెప్పింది. ఇప్పటికీ స్టేజీ నాటకాలంటే ఆసక్తి అని తెలిపింది. ప్రస్తుతం తానీ స్థాయికి చేరడానికి తన తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహమే కారణంగా పేర్కొంది. తనకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండడంతో సినిమాల్లో పాటల సన్నివేశాల్లో చాలా సులభంగా నటించగలుగుతున్నానంది. అయితే సినిమా నృత్య దర్శకత్వం టోటల్లీ డిఫరెంట్ అని పూర్ణ అంటోంది.