సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదవుల పందేరం త్వరలోనే ప్రారంభం కానుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన రాష్ర్ట కాంగ్రెస్ సమన్వయ సమితి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అలాంటి చర్చేమీ జరగలేదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఢిల్లీలో ప్రకటించినప్పటికీ, త్వరలోనే నియామకాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
మంత్రి వర్గ విస్తరణ, బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంపై చర్చ జరిగినప్పుడు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వీటి జోలికి పోకూడదని తొలుత అనుకున్నప్పటికీ, సుదీర్ఘ వాదనల తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వద్దనుకున్నారు. బోర్డులు, కార్పొరేషన్లలో సగం వాటిని భర్తీ చేయడం ద్వారా పార్టీ నాయకుల్లోని అసమ్మతిని తొలగించి.. నూతనోత్సాహాన్ని నింపవచ్చని అభిప్రాయం వ్యక్తమైంది. మిగిలిన వాటిని లోక్‌సభ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని వల్ల పదవులు పొందిన వారితో పాటు ఆశావహులు కూడా ఎన్నికల్లో బాగా పని చేస్తారని విశ్లేషించారు.
అప్పుడే ప్రయత్నాలు
పదవుల పందేరం ప్రారంభమవుతుందని తెలియగానే అనేక మంది శాసనస సభ్యులు తమకు ఆప్తులైన మంత్రులతో సమాలోచనలు జరిపారు. మరో వైపు మంత్రులు తమకు ఇష్టులైన కార్యకర్తలకు ఈ పదవులను ఇప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తొలి దఫాలో మంత్రి వర్గంలో స్థానం లభించని జిల్లాలకు పదవులు లభించనున్నాయి. ఈ నెల 25 నుంచి బెల్గాంలో ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల తర్వాత నియామకాలను ప్రారంభించనున్నారు.
విస్తరణ లేదు
ఇప్పట్లో రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 96వ జయంతిని పురస్కరించుకుని విధాన సౌధ ముంగిట మంగళవారం జాతీయ సమైక్యతా ప్రమాణం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకానికి అధిష్టానం అంగీకరించిందని వెల్లడించారు.
విధేయులకే ప్రాధాన్యం
పార్టీ కోసం కష్టించి పని చేస్తున్న వారికే పదవులను ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని పరమేశ్వర తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంపై సమన్వయ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు.
పదవుల పందేరం
Published Wed, Nov 20 2013 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement