నైపుణ్యాలను పెంచుకుందాం | President Mukherjee inaugurates 33rd India International Trade Fair | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలను పెంచుకుందాం

Published Thu, Nov 14 2013 11:18 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

President Mukherjee inaugurates 33rd India International Trade Fair

న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధి కోసం వృత్తి శిక్షణా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రగతి మైదాన్‌లో 33వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఐఐటీఎఫ్)ను గురువారం రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘పెరుగుతున్న జనాభా ఫలితంగా భారతదేశం ఆర్థిక లబ్ధిని పొందనుంది. 2030 నాటికి దేశంలోని 50 శాతం జనాభా ఉత్పత్తి శక్తుల్లో భాగమవుతారు. ప్రపంచంలోనే అత్యధిక శ్రమశక్తి కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఏదైనా సామాజిక పరివర్తనకు కారణమవుతుంది. త్వరితమవుతున్న ప్రపంచ మార్పులకు ధీటుగా ముందుకు సాగాలంటే మన శ్రమశక్తిని నైపుణ్యవంతం చేసుకోవాల్సి ఉంటుంద’ని ప్రణబ్  పిలుపునిచ్చారు. 
 ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన వాణిజ్య ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన 6 వేల మంది పాల్గొంటున్నారు. విస్తృత శ్రేణిలో ఎలక్ట్రానిక్, అలంకార, వినిమయ వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. 
 
 21 దేశాలకు చెందిన 260 మంది పారిశ్రామికులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. జపాన్, థాయ్‌లాండ్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, హాంగ్‌కాంగ్, కెనడా, ఇటలీ, అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక సంస్థలతో వ్యాపార ఒప్పందాల సమావేశాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. తొలి ఐదు రోజులు ప్రధానంగా ఇందుకే కేటాయించనున్నారు. ఇక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన నగరవాసులు ఇక్కడ ఏర్పాటు చేసిన పెవిలియన్లను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అందులో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను చూస్తూ మైమరచిపోతున్నా రు. ‘ప్రదర్శనలో వైవిధ్యం మమ్మల్ని ఆకట్టుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 
 
 గృహోపకరణాలు, దుస్తులు, నగలు, ఇంకా అనేక రకాల వినియోగ వస్తువులు అందుబాటులో ఉన్నాయ’ని మోనా అనే సందర్శకురాలు తెలిపింది. థాయ్‌లాండ్ స్టాల్ ముందు చేతి సంచులు కొనడానికి సందర్శకులు బారులు తీరా రు. అప్ఘానిస్తాన్ తివాచీలు ఆకర్షణీయంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులు ఈ ప్రదర్శకు భద్రత కల్పిస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement