రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఈ మేరకు కాషాయపార్టీకి ఎల్జీ నుంచి సోమవారం ఆహ్వానం అందే అవకాశముందని తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగ్‌దీశ్ ముఖి ముందున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఆహ్వానించకుండా చూడాలని ఆప్ నాయకుల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది.
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ ఆహ్వానిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామంటూ తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. తాజాగా ఎన్నికలు జరిపించినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించేందుకు అనుమతివ్వాలంటూ ఎల్జీ రాసిన లేఖను హోం మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని తెలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సోమవారం ఆహ్వానం అందవచ్చని కూడా అంటున్నారు.
పభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా ఎల్జీ బీజేపీని కోరవచ్చు. ఎన్టీటీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఎల్జీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చవచ్చు. అసెంబ్లీ స్పీకర్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా సీఎంను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తే ఇతర పార్టీలను చీల్చికుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చని అంటున్నారు. పార్టీలు విప్ జారీ చేయవచ్చా లేదా అన్నది స్పీకర్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం బీజేపీకి లేదు. మళ్లీ ఎన్నికలు వద్దని, ప్రభుత్వం ఏర్పాటే మేలని బీజేపీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూచిస్తున్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు కోరడం లేదని, వారిలో కొందరు తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అపఖ్యాతి మూటగట్టుకోవడానికి బీజేపీ సంశయిస్తోంది. ఈ పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీకి నమ్మకం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మరోసారి చెప్పారు. పార్టీలను చీల్చకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగగలిగే మార్గాలను బీజేపీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పేంటి ?: షా
ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్థించారు. ‘ఢిల్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీ. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మాకు స్పష్టమైన ఆధిక్యం దక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అది అనైతికం ఎలా అవుతుంది ? మళ్లీ ఎన్నికలు వద్దని అంతా కోరుకుంటున్నారు’ అని షా అన్నారు. ఇండియాటీవీ షో ఆప్ కీ అదాలత్‌లో మాట్లాడుతూ ఆయన పైవిధంగా అన్నారు. ఎమ్మెల్యేలను కొంటున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చారు.
సర్కారు ఏర్పాటు చేస్తాం
Published Sat, Sep 6 2014 10:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement