శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పండితులు వేదాశీర్వచనాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవో రాష్ట్రపతికి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్, డైరీ అందజేశారు. శ్రీవారి దర్శనానికి ముందు రాష్ట్రపతి వరాహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
కాగా అంతకుముందు ఉదయం 11.45 గంటలకు రేణిగుంట చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.