హుండీ చోరి కేసులో పూజారుల అరెస్టు
చెన్నై: తిరుచ్చెంగోడు అర్థనారీశ్వర ఆలయంలో నిఘా టీవీ కెమెరాను గుడ్డతో కప్పి హుండీ సొమ్మును అపహరించిన ఆలయ పూజారి, అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెందూరు నగరంలో సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల పురాతన ప్రసిద్ధి చెందిన అర్థనారీశ్వర స్వామి ఆలయం కొండ పైన ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇంకనూ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పండుగ ముహూర్తం రోజులలో ఆలయం భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ భక్తులు కానుకలు చెల్లించడానికి హుండి, దాని పక్కనే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆలయంలోని హుండీలో భక్తులు చెల్లించిన కానుకలు అపహరణకు గురైందువల్ల ఆలయ నిర్వాహకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసు జాయింట్ కమిషనర్ రత్నవేల్ సీసీ టీవీ కెమెరాలో నమోదయిన దృశ్యాలను పరిశీలించారు. ఆ సమయంలో గత 17వ తేది కెమెరాను నల్ల గుడ్డతో ఒక వ్యక్తి మూసివేస్తూ కనిపించాడు. వెంటనే పోలీసులు ఆలయంలో పని చేసే వారి వద్ద విచారణ చేపట్టారు. ఆ సమయంలో పారంపర్య పూజారి జ్ఞానమణి (65), అతని కుమారుడు ముల్లైవన నాధన్ (24)లు హుండీలో డబ్బులు చోరీ చేసినట్లు అంగీకరించారు. విచారణలో వారు రూ. 20 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించుకున్నారని దాని కోసం ప్రతి రోజూ చోరి చేసేవారని ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షలను చోరి చేసినట్లు తెలిసింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.