నాచగిరిలో దొంగల హల్‌చల్
వర్గల్ : చోరులు బరి తెగించారు. మండల పరిధిలోని నాచగిరి పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాల తాళాలు బద్దలుకొట్టి లోనికి చొరబడి హుండీలు, బీరువాలను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం రాత్రి రోజు మాదిరిగానే నాచగిరి ఆలయ అర్చక, పురోహితులు పూ జా కార్యక్రమాలు ముగించి గుడి మూసేశారు. అదే రోజు రాత్రి ఆలయం వద్ద పహారా కాసేందుకు ముగ్గురు నైట్ వాచ్‌మెన్లు విధుల్లో చేరారు.
సోమవారం రాత్రి అనూహ్యంగా సాయిబాబా ఆలయం వద్ద ఇనుప గేటు గొలుసు విరగ్గొట్టారు. అందులోనుంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించారు. మెట్ల దిగువున ఉన్న నవగ్రహాలయ హుండీ బద్దలు కొట్టారు. లోపలి వైపు తాళం లేకపోవడంతో హుండీ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న శివాలయం హుండీ తాళం, రామాలయం హుండీ పగులకొట్టేందుకు ప్రయత్నించారు.
లడ్డూల కోటా గది తాళం బద ్ధలు కొట్టి లోపలి బీరువా తెరచి సొమ్ము కోసం వెతుకులాడారు. ఆ తరువాత ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేక దర్శనం గేటు తాళం పగులగొట్టారు. ఆలయ మండపంలోని ఆండాళమ్మ కోవెల గదిని తెరి చేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. అయితే శివాలయం వద్ద, ప్ర దాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఓ పక్కకు తిప్పేశారు.
ఇంత జరుగుతున్నా.. పహారా కాసే కాపలాదారులకు వినిపించకపోవడం గమనార్హం. కాగా మంగళవారం ఉదయం అర్చకులు ఆలయం తెరిచేందుకు వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదు. అర్చకుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ హేమంత్ కుమార్, సంగారెడ్డి ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ శివరాజ్ మంగళవారం ఉదయం ఆలయం చేరుకుని చోరీ తీరు పరిశీలించారు.
తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తూప్రాన్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ ఆలయం సందర్శించారు. సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు వాచ్‌మెన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.