
కుమరికి మోదీ
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో అడుగు పెట్టనున్నారు. మే ఆరు,ఏడు తేదీల్లో ఆయన పర్యటన సాగే అవకాశాలు ఉన్నాయి. బహిరంగ సభకు స్థల పరిశీలనలో కన్యాకుమారి జిల్లా బీజేపీ వర్గాలు, ఎస్పీ ధర్మరాజన్ నేతృత్వంలోని బృందం నిమగ్నమైంది.చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమ, మిత్ర పక్షాల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పర్యటనకు బీజేపీ జాతీయ నేతలు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా రాష్ట్రంలో పర్యటించి ఓట్ల వేటకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తిరుచ్చి, కోయంబత్తూరులలో ఉన్న పార్టీ ముఖ్య అభ్యర్థులకు మద్దతుగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచార పయనం సాగిస్తున్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లాలోని నియోజకవర్గాల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసింది. పొన్‌రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రిగా ఇక్కడి నుంచే ఎదగడంతో ఆ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని కమలం పెద్దలు సారించి ఉన్నారు. ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా పొన్‌రాధాకృష్ణన్ తీవ్ర ఓట్ల వేటలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తరహాలో ఈ సారి ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ప్రచార భేరి మోగించేందుకు నిర్ణయించారు. మోదీ ప్రచార పర్యటన సిద్ధం అవుతుండడంతో బహిరంగ సభ ఏర్పాట్లపై కమలనాథులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ రానున్నడడంతో అందుకుతగ్గ భద్రతా ఏర్పాట్ల
మీద సమీక్షకు కన్యాకుమారి పోలీసు యంత్రాంగం సిద్ధమైంది.
మంగళవారం కమలనాథులు స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ ధర్మరాజన్ నేతృత్వంలోని డీఎస్‌పీలు సెల్వరత్నం, బాల మురుగన్‌లతో కూడిన బృందం పరిశీనలో నిమగ్నమైంది. లోక్ సభ ఎన్నికల సమయంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న భారీ మైదానంలో మోదీ ప్రచార సభ జరిగిన దృష్ట్యా, ఆ వేదికను ఎంపిక చేయడానికి చర్యలు చేపట్టి ఉన్నారు. అలాగే, సమీపంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ క్రీడా మైదానాన్ని సైతం పరిశీలించారు.
ప్రధాని మోదీ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు తగ్గ ఏర్పాట్లు, రోడ్డు మార్గంలో కూత వేటు దూరం ఆయన పర్యటన తదితర అంశాలపై సమీక్షించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి కన్యాకుమారి జిల్లా యంత్రాంగం పంపించనుంది. తదుపరి కేంద్రంలోని ఎన్‌ఎస్‌జీ వర్గాలు కన్యాకుమారిలో పర్యటించి వేదికను ఖారారు చేయనున్నారు. కుమరితో పాటుగా కోయంబత్తూరులోనూ మోదీ ప్రచార బహిరంగ సభకు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్న దృష్ట్యా, ఆయన పర్యటన రెండు రోజులా, ఒకే రోజా అన్నది తేలాల్సి ఉంది. మే ఆరు, ఏడు తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచార పర్యటన ఉంటుందని కమలనాథులు పేర్కొంటున్నారు.