
ఖాండ్వా/సియోనీ: దేశాన్ని దాదాపు 60 ఏళ్ల పాటు పాలించినా గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ చేసిందంటూ ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా, సియోనీ జిల్లాల్లో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు చేపట్టిన చర్యలను వివరించారు. వాజ్‌పేయీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దేశంలో తొలిసారి ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
రాముని క్షేమం చూసిన, ఆయన్ను పురుషోత్తమునిగా ప్రస్తుతించిన గిరిజనులను పూజించడం బీజేపీ సంస్కృతి అన్నారు. ‘‘కాంగ్రెస్‌కు మాత్రం గాంధీల కుటుంబ క్షేమం తప్ప మరేమీ పట్టదు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ముఖ్య నేతలిద్దరూ కొట్టుకుంటున్నారు. తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఇక్కడ ఎలాగోలా అధికారంలోకి వచ్చి, లోక్‌సభ ఎన్నికల ఖర్చుల నిమిత్తం రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
అలాంటి పార్టీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది. దాని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీని ప్రతి ఎన్నికలోనూ ఓడిస్తూ దేశం నుంచి తరిమి కొడుతున్నారు’’అని మోదీ అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.300 ఉన్న నెలవారీ మొబైల్ సేవల చార్జీలు కాంగ్రెస్ గనక అధికారంలో ఉంటే ఏకంగా రూ. 4,000–5,000 దాకా ఉండేవన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినవాడిగా పేదల కష్టాలేమిటో తనకు తెలుసన్నారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ మధ్య అప్పుడే అధికారం కోసం కీచులాట మొదలైందని ఎద్దేవా చేశారు.
అద్భుత మిజోరం మా లక్ష్యం
ఐజ్వాల్: మిజోరంను అద్భుతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఓటర్లను ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మిజోలు తన కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు. విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ మిజోరంను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దుతామన్నారు. అక్టోబర్ 30న మిజోరంలో మోదీ ఎన్నికల సభ జరగాల్సి ఉండగా రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment