- 10 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న బీఎంసీ
- గడిచిన రెండేళ్ల నుంచే అమల్లోకి అని వెల్లడి
- తాజా నిర్ణయంతో పాఠశాలలు మూత పడే అవకాశం!
సాక్షి, ముంబై: బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. ఆ భవనాల అద్దెను పది శాతం పెంచుతున్నట్లు బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గడిచిన రెండేళ్ల నుంచి వర్తిస్తుందని చెప్పి మరో పిడుగు వేసింది. ఈ మేరకు రెండేళ్లకు ఒక్కో విద్యా సంస్థ రూ. మూడు లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మరాఠీ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లపై భారం మోపేందుకు బీఎంసీ సిద్ధపడటంతో చాలా పాఠశాలలు మూత పడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి (నైట్ స్కూల్స్) నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడింది.
ముంబైలో ఉన్న సుమారు 289 పాఠశాలల్లో 70 శాతం బీఎంసీ ఆధ్వరంలో నడుస్తుండగా, మిగతా 30 శాతం పాఠశాలల భవనాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు 2013 నుంచి ప్రతి తరగతి గదికి రూ. వెయ్యి చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించడానికే విద్యా సంస్థలు నానాతంటాలు పడుతుంటే ఈ పెంపు మరింత భారం కానుంది. ప్రభుత్వం ఇదివరకే వేతనేతర పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడం కూడా నిలిపివేయడంతో.. తాజా నిర్ణయం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అద్దె పెంపును రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బీఎంసీ స్థలాల్లో అనేక స్వయం సేవా సంస్థలు తమ కార్యకలాపాలు, తరగతులు జరుగుతున్నాయి. ఇందుకు బీఎం సీ నుంచి ఆర్థిక మద్దతు, రాయితీ లభిస్తోంది.
ప్రైవేటు విద్యాసంస్థలపై ‘అద్దె’ భారం
Published Tue, May 19 2015 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement