Schools Buildings
-
ప్రభుత్వ పాఠశాలలంటే ఇలానే ఉండాలా?
కొత్తగూడెంరూరల్: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని చెపుతున్న అధికారులు, పాలకులు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ఆ భవనాలు ఎప్పుడు కూలుతాయోనని ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం స్లాబ్ నుంచి నిత్యం పెచ్చులు ఊడి విద్యార్థులపైనే పడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో కొన్నిశిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయోనని భయంగా ఉందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇలాంటి వాటిని తొలగించి, నూతన భవనాలు నిర్మించాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిథిలావస్థలో 142 పాఠశాలలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో మొతం 142 పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో కొత్తగూడెం మండలంలో 18, లక్ష్మీదేవిపల్లిలో 5, టేకులపల్లిలో 26, బూర్గంపాడులో 1, చండ్రుగొండలో 5, దమ్మపేటలో 20, ములకలపల్లిలో 8, మణుగూరులో 7, ఇల్లెందులో 6, దుమ్ముగూడెంలో 15, చర్లలో 6, ఆశ్వారావుపేటలో 10, ఆశ్వాపురంలో 5, కరకగూడెంలో 1, పినపాకలో 2, చుంచుపల్లిలో 2, సుజాతనగర్ మండలంలో 5 పాఠశాల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని తక్షణమే తొలగించి నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాంటి భవనాలను తొలగిస్తాం జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాలల వివరాలను ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓకు పంపించాం. వాటిని తొలగించాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు నివేదికలు అందజేశాం.– వాసంతి, డీఈఓ -
ప్రైవేటు విద్యాసంస్థలపై ‘అద్దె’ భారం
- 10 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న బీఎంసీ - గడిచిన రెండేళ్ల నుంచే అమల్లోకి అని వెల్లడి - తాజా నిర్ణయంతో పాఠశాలలు మూత పడే అవకాశం! సాక్షి, ముంబై: బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. ఆ భవనాల అద్దెను పది శాతం పెంచుతున్నట్లు బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గడిచిన రెండేళ్ల నుంచి వర్తిస్తుందని చెప్పి మరో పిడుగు వేసింది. ఈ మేరకు రెండేళ్లకు ఒక్కో విద్యా సంస్థ రూ. మూడు లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మరాఠీ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లపై భారం మోపేందుకు బీఎంసీ సిద్ధపడటంతో చాలా పాఠశాలలు మూత పడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి (నైట్ స్కూల్స్) నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ముంబైలో ఉన్న సుమారు 289 పాఠశాలల్లో 70 శాతం బీఎంసీ ఆధ్వరంలో నడుస్తుండగా, మిగతా 30 శాతం పాఠశాలల భవనాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు 2013 నుంచి ప్రతి తరగతి గదికి రూ. వెయ్యి చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించడానికే విద్యా సంస్థలు నానాతంటాలు పడుతుంటే ఈ పెంపు మరింత భారం కానుంది. ప్రభుత్వం ఇదివరకే వేతనేతర పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడం కూడా నిలిపివేయడంతో.. తాజా నిర్ణయం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అద్దె పెంపును రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బీఎంసీ స్థలాల్లో అనేక స్వయం సేవా సంస్థలు తమ కార్యకలాపాలు, తరగతులు జరుగుతున్నాయి. ఇందుకు బీఎం సీ నుంచి ఆర్థిక మద్దతు, రాయితీ లభిస్తోంది.