కొత్తగూడెంరూరల్: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని చెపుతున్న అధికారులు, పాలకులు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ఆ భవనాలు ఎప్పుడు కూలుతాయోనని ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం స్లాబ్ నుంచి నిత్యం పెచ్చులు ఊడి విద్యార్థులపైనే పడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో కొన్నిశిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయోనని భయంగా ఉందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇలాంటి వాటిని తొలగించి, నూతన భవనాలు నిర్మించాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శిథిలావస్థలో 142 పాఠశాలలు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో మొతం 142 పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో కొత్తగూడెం మండలంలో 18, లక్ష్మీదేవిపల్లిలో 5, టేకులపల్లిలో 26, బూర్గంపాడులో 1, చండ్రుగొండలో 5, దమ్మపేటలో 20, ములకలపల్లిలో 8, మణుగూరులో 7, ఇల్లెందులో 6, దుమ్ముగూడెంలో 15, చర్లలో 6, ఆశ్వారావుపేటలో 10, ఆశ్వాపురంలో 5, కరకగూడెంలో 1, పినపాకలో 2, చుంచుపల్లిలో 2, సుజాతనగర్ మండలంలో 5 పాఠశాల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని తక్షణమే తొలగించి నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
అలాంటి భవనాలను తొలగిస్తాం
జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాలల వివరాలను ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓకు పంపించాం. వాటిని తొలగించాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు నివేదికలు అందజేశాం.– వాసంతి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment