worst buildings
-
అర్ధశతాబ్దమైనా.. అరకొరవసతులే
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పడి 50 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం బోర్డు ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యకు 50 సంవత్సరాలు నిండినా ఇప్పటికీ జిల్లాలోని జూనియర్ కళాశాలలు అసౌకర్యాలతోనూ, అరకొర వసతులతోనూ కునారిల్లుతున్నాయి. రానురాను ప్రభుత్వ రంగ ఇంటర్ విద్య నిర్వీర్యమైపోతోంది. కనీసం పర్మినెంట్ లెక్చరర్లను కూడా నియమించలేని దుర్భర పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కేవలం కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం జూని యర్ కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్లను నియమించడం లేదన్న విమర్శలున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలే అధికం జిల్లాలో ఇంటర్మీడియట్ చదవడానికి ప్రభుత్వం అవసరమైనన్ని కళాశాలలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం జిల్లాలో 154 ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉండగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కేవలం 33 మాత్రమే ఉన్నాయంటే ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను ఎంతగా విస్మరిస్తోందో తెలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 396 రెగ్యులర్ లెక్చరర్ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం కేవలం 129 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఐతే అన్ని గ్రూపులు బోధించడానికి అవసరం కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన 250 మంది లెక్చరర్లను, మరో 33 మందిని గెస్ట్ లెక్చరర్లుగా నియమించింది. తగ్గుతున్న విద్యార్థులు ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడానికి, లెక్చరర్ల నియామకానికి ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితిలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో అత్యధిక ఫీజులు చెల్లించి చదువు కొనాల్సివస్తోంది. ఈ మేరకు గత ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,632 మంది విద్యార్థులు చేరగా ఈ సంవత్సరానికి వచ్చేసరికి కేవలం 3,988 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్క సంవత్సరంలో సుమారు 650 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇదిలా ఉండగా జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో మాత్రం ఈ ఏడాది 28,257 మంది చేరారు. అంటే ఇంటర్మీడియట్ విద్యకు ఎంతమంది విద్యార్థులున్నారో.. ప్రభుత్వరంగ ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో తెలుసుకోవచ్చు. స్వర్ణోత్సవ వేడుకలకు దేహీ! 50 వసంతాలు నిండిన సందర్భంగానైనా ప్రతిష్టాత్మకంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తోంది. ప్రతీ జూనియర్ కళాశాలలో ఉత్సవాలు నిర్వహించాలని, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డుతో ఆదేశాలు జారీ చేయించి చేతులు దులుపుకుంది. ఐతే ఈ ఉత్సవాలకు ఎంత ఖర్చు అవుతుంది, విద్యార్థులకు నిర్వహించే పోటీల అనంతరం బహుమతులు ఎలా ఇవ్వాలి, వారికి ప్రయాణ ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. కనీసం నామమాత్రపు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఆయా కళాశాలల ప్రిన్స్‌పాల్స్, అధ్యాపకులే తలా కొంచం డబ్బు వేసుకుని ఉత్సవాలు చేస్తుండగా, మరికొన్ని కళాశాలల ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల వద్దకు వెళ్ళి జోలెపడుతున్నారు. ఇంతబతుకూ బతికిన అయ్యవార్లు ఉత్సవాల పేరిట దేహీ అని చేతులు చాచాల్సి వస్తుందేమిటా అని ఆందోళన చెందుతున్నారు. లెక్చరర్ల నియామకం లేదు రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులున్నారు. లెక్చరర్ పోస్టుల కోసం మరెంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసే వారు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని ప్రభుత్వం స్వర్ణోత్సవ వేడుకలంటూ హడావుడి చేస్తోంది. – డి.అంబేద్కర్, ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పరీక్ష ఫీజులు పెంచి భారం మోపింది ఇంటర్మీడియట్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పేద విద్యార్థులకు భారంగా పరిణమించేలా ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజులు పెంచి భారం మోపింది. దీనికి తోడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలంటేనే పారిపోయి, భారమైనా కార్పొరేట్ కళాశాలల్లోనే చదవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. – కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు -
నెత్తిపై మృత్యు దేవత
పెంకులు పడిపోతుంటాయి. నెత్తిన బొప్పి కడుతుంటాయి. పైకప్పులోంచి చువ్వలు కనిపిస్తుంటాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం.. ఎప్పుడే ప్రాణం పోతుందోనని కలవరం. శిధిలమవుతున్న ప్రభుత్వ భవనాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న గదుల్లో పాఠశాలలు సాగుతున్నాయి. పాచిపెంటలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి ఓ విద్యార్థి నిండు ప్రాణం రాలిపోయింది. నెత్తిపైనే మృత్యుదేవత తాండవిస్తోంది. సాక్షి,విజయనగరం: సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నివాసాలు శిధిలమయ్యాయి. పెదంకలాం పీహెచ్సీ భవనం శిధిలమై పాములకు నివాసంగా మారింది. గుమ్మిడివరంలో ఎంపీఈ స్కూల్ అదనపు భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది. – సీతానగరం (పార్వతీపురం) మండలంలోని భోజరాజపురంలో పాఠశాల భవనం పూర్తిగా పాడైనా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గోపాలరాయుడిపేట ఎంపీపీ పాఠశాల భవనంలో తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది. – బొబ్బిలి రూరల్ నెల్లిమర్ల మండల పరిషత్ భవనం శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ భవనాన్ని 1998లో మిమ్స్ ఆస్పత్రి సేవలకు అప్పగించగా 2002లో ఖాళీ చేసినా తొలగించలేదు. – నెల్లిమర్ల చీపురుపల్లి ఆర్ అండ్ బి సహాయ ఇంజనీర్ అధికారి కార్యాలయం శిధిలం కావడంతో సిబ్బంది ఖాళీ చేశారు. కొన్నాళ్లకు భవనం కొంత కూలిపోయినా ఇంతవరకు తొలగించలేదు. జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి అంతస్తులోని పలు భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. – చీపురుపల్లి మెరకముడిదాంలో రెండేళ్ల క్రితం ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి భవనం వృధాగా పడి ఉండటంతో శిధిలావస్థకు చేరింది. – మెరకముడిదాం (చీపురుపల్లి) వేపాడ మండలంలో శిధిలమైన భవనాల్లోనే చదువులు సాగుతున్నాయి. ఆకులసీతంపేట, సోంపురం, గుడివాడ, కుమ్మపల్లి, జగ్గయ్యపేట, ఎస్.కోట సీతారాంపురం, వేపాడ తదితర ప్రాథమిక పాఠశాలలు ఏ క్షణాన్నయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వేపాడ (శృంగవరపుకోట) -
ప్రభుత్వ పాఠశాలలంటే ఇలానే ఉండాలా?
కొత్తగూడెంరూరల్: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని చెపుతున్న అధికారులు, పాలకులు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ఆ భవనాలు ఎప్పుడు కూలుతాయోనని ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం స్లాబ్ నుంచి నిత్యం పెచ్చులు ఊడి విద్యార్థులపైనే పడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో కొన్నిశిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయోనని భయంగా ఉందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇలాంటి వాటిని తొలగించి, నూతన భవనాలు నిర్మించాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిథిలావస్థలో 142 పాఠశాలలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో మొతం 142 పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో కొత్తగూడెం మండలంలో 18, లక్ష్మీదేవిపల్లిలో 5, టేకులపల్లిలో 26, బూర్గంపాడులో 1, చండ్రుగొండలో 5, దమ్మపేటలో 20, ములకలపల్లిలో 8, మణుగూరులో 7, ఇల్లెందులో 6, దుమ్ముగూడెంలో 15, చర్లలో 6, ఆశ్వారావుపేటలో 10, ఆశ్వాపురంలో 5, కరకగూడెంలో 1, పినపాకలో 2, చుంచుపల్లిలో 2, సుజాతనగర్ మండలంలో 5 పాఠశాల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని తక్షణమే తొలగించి నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాంటి భవనాలను తొలగిస్తాం జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాలల వివరాలను ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓకు పంపించాం. వాటిని తొలగించాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు నివేదికలు అందజేశాం.– వాసంతి, డీఈఓ -
ప్రపంచ చెత్త బిల్డింగులు ఇవేనట!
సాక్షి, స్కూల్ ఎడిషన్: అవార్డులంటే గొప్పవారికి, గొప్పవాటికే కాదు. చెత్తగా ఉండే వారికి, చెత్తగా ఉండే వాటికి కూడా ఇస్తున్నారు. సినిమాల్లో అతి చెత్త నటులకు, వారు వేసుకునే చెత్త దుస్తులకు కూడా అవార్డులు ఇవ్వడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. అలాగే ప్రతిఏటావిడుదలయ్యే చిత్రాల్లో చెత్త చిత్రాలకు కూడా అవార్డులిస్తున్నారిప్పుడు. ఇలాంటి చెత్త అవార్డులు అందించే కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణమవుతున్న బిల్డింగులు కూడా ఉన్నాయి. అలా ప్రపంచం మొత్తం మీద చెత్త బిల్డింగులుగా నిలిచిన నిర్మాణాలేమిటో తెలుసుకుందాం.. లండన్స్ వూల్విచ్ సెంట్రల్.. బ్రిటన్‌కు చెందిన బిల్డింగ్ డిజైన్ అనే మ్యాగజైన్ కార్బంకుల్ కప్ పేరిట ప్రతిఏటా బ్రిటన్‌లో ఉన్న బిల్డింగుల్లో చెత్తగా ఉన్నవాటికి వరస్ట్ బిల్డింగ్స్ అవార్డుల్ని అందిస్తుంది. వాటిలో గత ఏడాది కొత్తగా నిర్మాణమైనవాటిల్లో అతి చెత్త బిల్డింగ్‌గా లండన్‌లోని ‘వూల్విచ్ సెంట్రల్’కి అవార్డు దక్కింది. బిల్డింగ్ డిజైన మ్యాగజైన్ ఆరు బిల్డింగ్స్‌ని ఎంపిక చేసి, వాటికి ఓటింగ్ నిర్వహించి ఈ ఫలితాన్ని ప్రకటించింది. ‘వూల్విచ్ సెంట్రల్’ ఓ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్. 7,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైన ఈ బిల్డింగ్‌లో దాదాపు 189 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ డిజైనింగ్, సదుపాయాలు, తదితర అంశాల ఆధారంగ ఈ ఎంపిక జరిగింది. జె. ఎడ్జర్ హూవర్ బిల్డింగ్ ఇది అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రధాన కార్యాలయం. వాషింగ్టన్ డి.సిలో ఉన్న ఈ బిల్డింగ్‌ను అక్కడి ప్రజలు అతిచెత్త బిల్డింగ్‌గా భావిస్తారు. వాషింగ్టన్ నగర నిర్మాణం, ప్రణాళిక ప్రకారం ఇది ఎంతమాత్రం నగరంలోని ఇతర బిల్డింగులతో పోటీపడగల స్థాయి కాదని వారి అంచనా. అయితే ఈ బిల్డింగులో సెక్యూరిటీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ ఫ్లోరింగ్ తదితర సౌకర్యాలున్నప్పటికీ ఇది ప్రపంచంలోని చెత్త బిల్డింగుల్లో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఇది చాలా ఏళ్ల క్రితం నిర్మించినదవడం వల్ల ఈ బిల్డింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియమ్ అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఇది ఓ పురాతన మ్యూజియం. అనేక చారిత్రక సంపదను దాచుకున్న ఈ బిల్డింగ్ దాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్లకే అంతగా నచ్చలేదు. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేసరికి కనిపించిన లోపాలు, ఆకారాల్లో తేడాలు వంటివల్ల ఇది అంతగా ఆకట్టుకోదు. షార్ప్ సెంటర్ ఫర్ డిజైన్ కెనడాలోని టొరంటోలో ఉన్న ఈ బిల్డింగ్‌కి ప్రపంచ చెత్త బిల్డింగుల్లో ఒకటిగా చోటు దక్కింది. ఇది ఒంటారియో ఆర్ట్ అండ్ డిజైన్ కాలేజ్ బిల్డింగ్. పై అంతస్థులు రోడ్డు మీదికి చొచ్చుకొచ్చినట్లుగా ఉండే ఈ బిల్డింగును కొందరు సృజనాత్మకమైనదిగా భావిస్తారు. మరికొందరు మాత్రం అసహ్యమైనదని అంటారు. బ్రిటీష్‌కు చెందిన ఆర్కిటెక్ట్స్, టొరంటోకు చెందిన నిర్మాణ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఓయామా టెక్నికల్ కాలేజ్ జపాన్ రాజధాని టోక్యోలోని షిబుయా ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగ్ ప్రపంచ చెత్త బిల్డింగుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఆధునిక యుగానికి ముందుగా జపాన్‌లో నిర్మితమైన ఓ వింత ఆకారంలో ఉండే బిల్డింగ్. ఇది అనేక పదునుగా మొనదేలినట్టుండే మూలలవంటి నిర్మాణాల్ని కలిగి, ఎరుపు, వెండి వంటి రంగుల్లో ఉంది. ఇది పూర్తిగా లోహంతో నిర్మాణమైనట్లుగా కనిపిస్తుంది. సాధారణ బిల్డింగ్లాగా కనిపించకుండా ఒక రోబో మిషన్లాగా అనిపించడం ఈ బిల్డింగ్ ప్రత్యేకత. ఇటీవల దీనికి చెత్త బిల్డింగుల్లో ఒకటిగా నిలిచినప్పటికీ దీనికిగల వెరైటీ డిజైనింగ్ వల్ల చిత్రంగా 1988లో ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావగం గమనార్హం. గీజిల్ లైబ్రరీ ప్రపంచ చెత్త బిల్డింగుల్లో ఐదో స్థానంలో నిలిచిన గీజిల్ లైబ్రరీ కూడా అమెరికాకు చెందినదే. శాన్డిగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రాంగణంలో ఉన్న దీని నిర్మాణం, ఆకారం వింతగా ఉంటాయి. సాధారణ బిల్డింగుల్లా నిలువుగా కాకుండా విచిత్రంగా ఉంటుంది. ఈ బిల్డింగ్‌ను యూనివర్సిటీ లోగోలో కూడా చూడొచ్చు. అసాధారణంగా ఉన్న దీని నిర్మాణం వల్ల ఈ బిల్డింగ్‌కు చెత్త బిల్డింగ్‌గా చోటు దక్కింది. చాంగ్ బిల్డింగ్ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఉన్న ఈ బిల్డింగ్ వరస్ట్ బిల్డింగ్స్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. దీని నిర్మాణం నడుచుకుంటూ వెళ్తున్న ఎలిఫెంట్ ఆకారంలో ఉండడంవల్ల స్థానికంగా దీన్ని ఎలిఫెంట్ టవర్ అంటారు. దీనికున్న భిన్నమైన ఆకారం వల్ల ఇది ఈ జాబితాలో చోటు సంపాదించింది. ఈ బిల్డింగ్‌లో ఆఫీసులు, వ్యాపార సముదాయాలతో పాటు, రెసిడెన్షియల్ హౌజ్‌లు కూడా ఉన్నాయి. ఎపి అపార్ట్మెంట్స్ అమెరికాలోని సీటిల్ ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగుల్ని చూడగానే ఇది మధ్యలో కూలిపోతుందా అన్నట్లుంటుంది. మధ్యలో ఓ వైపు ఒరిగిపోతుందా అనిపించేలా వింతగా చేపట్టిన దీని నిర్మాణమే ఎపి అపార్ట్‌మెంట్‌కు ఈ జాబితాలో చోటు దక్కేలా చేసింది. ఈ బిల్డింగ్‌కి చివరలో అమర్చిన వింత ఆకారపు నిర్మాణాలు కూడా బిల్డింగ్ ప్రత్యేకతను తెలియజేస్తాయి. సౌందర్యం, కొత్తదనం కోసమే ఈ నిర్మాణం జరిగినా ఇది ప్రపంచపు వరస్ట్ బిల్డింగ్‌లలో స్థానం సంపాదించుకుంది.