అర్ధశతాబ్దమైనా.. అరకొరవసతులే | Still No Facilities | Sakshi
Sakshi News home page

అర్ధశతాబ్దమైనా.. అరకొరవసతులే

Published Mon, Dec 3 2018 3:25 PM | Last Updated on Mon, Dec 3 2018 3:25 PM

Still No Facilities - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పడి 50 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం బోర్డు ఆదేశాల మేరకు జూనియర్‌ కళాశాలల్లో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్‌ విద్యకు 50 సంవత్సరాలు నిండినా ఇప్పటికీ జిల్లాలోని జూనియర్‌ కళాశాలలు అసౌకర్యాలతోనూ, అరకొర వసతులతోనూ కునారిల్లుతున్నాయి. రానురాను ప్రభుత్వ రంగ ఇంటర్‌ విద్య నిర్వీర్యమైపోతోంది. కనీసం పర్మినెంట్‌ లెక్చరర్లను కూడా నియమించలేని దుర్భర పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కేవలం కార్పొరేట్‌ కళాశాలలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం జూని యర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించడం లేదన్న విమర్శలున్నాయి.

కార్పొరేట్‌ విద్యా సంస్థలే అధికం
జిల్లాలో ఇంటర్మీడియట్‌ చదవడానికి ప్రభుత్వం అవసరమైనన్ని కళాశాలలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం జిల్లాలో 154 ప్రైవేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉండగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కేవలం 33 మాత్రమే ఉన్నాయంటే ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యను ఎంతగా విస్మరిస్తోందో తెలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 396 రెగ్యులర్‌ లెక్చరర్‌ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం కేవలం 129 మంది మాత్రమే రెగ్యులర్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఐతే అన్ని గ్రూపులు బోధించడానికి అవసరం కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన 250 మంది లెక్చరర్లను, మరో 33 మందిని గెస్ట్‌ లెక్చరర్లుగా నియమించింది.

తగ్గుతున్న విద్యార్థులు
ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడానికి, లెక్చరర్ల నియామకానికి ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితిలో కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అత్యధిక ఫీజులు చెల్లించి చదువు కొనాల్సివస్తోంది. ఈ మేరకు గత ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 4,632 మంది విద్యార్థులు చేరగా ఈ సంవత్సరానికి వచ్చేసరికి కేవలం 3,988 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్క సంవత్సరంలో సుమారు 650 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇదిలా ఉండగా జిల్లాలోని కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో మాత్రం ఈ ఏడాది 28,257 మంది చేరారు. అంటే ఇంటర్మీడియట్‌ విద్యకు ఎంతమంది విద్యార్థులున్నారో..  ప్రభుత్వరంగ ఇంటర్మీడియట్‌ విద్యను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో తెలుసుకోవచ్చు.
 
స్వర్ణోత్సవ వేడుకలకు దేహీ!
50 వసంతాలు నిండిన సందర్భంగానైనా ప్రతిష్టాత్మకంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తోంది. ప్రతీ జూనియర్‌ కళాశాలలో ఉత్సవాలు నిర్వహించాలని, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డుతో ఆదేశాలు జారీ చేయించి చేతులు దులుపుకుంది. ఐతే ఈ ఉత్సవాలకు ఎంత ఖర్చు అవుతుంది, విద్యార్థులకు నిర్వహించే పోటీల అనంతరం బహుమతులు ఎలా ఇవ్వాలి, వారికి ప్రయాణ ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. కనీసం నామమాత్రపు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఆయా కళాశాలల ప్రిన్స్‌పాల్స్, అధ్యాపకులే తలా కొంచం డబ్బు వేసుకుని ఉత్సవాలు చేస్తుండగా, మరికొన్ని కళాశాలల ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల వద్దకు వెళ్ళి జోలెపడుతున్నారు. ఇంతబతుకూ బతికిన అయ్యవార్లు ఉత్సవాల పేరిట దేహీ అని చేతులు చాచాల్సి వస్తుందేమిటా అని ఆందోళన చెందుతున్నారు.

లెక్చరర్ల నియామకం లేదు 
రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులున్నారు. లెక్చరర్‌ పోస్టుల కోసం మరెంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా పనిచేసే వారు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని ప్రభుత్వం స్వర్ణోత్సవ వేడుకలంటూ హడావుడి చేస్తోంది. – డి.అంబేద్కర్, ప్రైవేట్‌ లెక్చరర్స్, టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

పరీక్ష ఫీజులు పెంచి భారం మోపింది
ఇంటర్మీడియట్‌ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పేద విద్యార్థులకు భారంగా పరిణమించేలా ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజులు పెంచి భారం మోపింది. దీనికి తోడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలంటేనే పారిపోయి, భారమైనా కార్పొరేట్‌ కళాశాలల్లోనే చదవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
– కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement