ప్రపంచ చెత్త బిల్డింగులు ఇవేనట! | worst buildings in world | Sakshi
Sakshi News home page

ప్రపంచ చెత్త బిల్డింగులు ఇవేనట!

Published Sat, Nov 7 2015 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

ప్రపంచ చెత్త బిల్డింగులు ఇవేనట!

ప్రపంచ చెత్త బిల్డింగులు ఇవేనట!

 సాక్షి, స్కూల్ ఎడిషన్:
అవార్డులంటే గొప్పవారికి, గొప్పవాటికే కాదు. చెత్తగా ఉండే వారికి, చెత్తగా ఉండే వాటికి కూడా ఇస్తున్నారు. సినిమాల్లో అతి చెత్త నటులకు, వారు వేసుకునే చెత్త దుస్తులకు కూడా అవార్డులు ఇవ్వడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. అలాగే ప్రతిఏటావిడుదలయ్యే చిత్రాల్లో చెత్త చిత్రాలకు కూడా అవార్డులిస్తున్నారిప్పుడు. ఇలాంటి చెత్త అవార్డులు అందించే కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణమవుతున్న బిల్డింగులు కూడా ఉన్నాయి. అలా ప్రపంచం మొత్తం మీద చెత్త బిల్డింగులుగా నిలిచిన నిర్మాణాలేమిటో తెలుసుకుందాం..
 
 లండన్స్ వూల్‌విచ్ సెంట్రల్..
 బ్రిటన్‌కు చెందిన బిల్డింగ్ డిజైన్ అనే మ్యాగజైన్ కార్బంకుల్ కప్ పేరిట ప్రతిఏటా బ్రిటన్‌లో ఉన్న బిల్డింగుల్లో చెత్తగా ఉన్నవాటికి వరస్ట్ బిల్డింగ్స్ అవార్డుల్ని అందిస్తుంది. వాటిలో గత ఏడాది కొత్తగా నిర్మాణమైనవాటిల్లో అతి చెత్త బిల్డింగ్‌గా లండన్‌లోని ‘వూల్‌విచ్ సెంట్రల్’కి అవార్డు దక్కింది. బిల్డింగ్ డిజైన మ్యాగజైన్ ఆరు బిల్డింగ్స్‌ని ఎంపిక చేసి, వాటికి ఓటింగ్ నిర్వహించి ఈ ఫలితాన్ని ప్రకటించింది. ‘వూల్‌విచ్ సెంట్రల్’ ఓ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్. 7,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైన ఈ బిల్డింగ్‌లో దాదాపు 189 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ డిజైనింగ్, సదుపాయాలు, తదితర అంశాల ఆధారంగ ఈ ఎంపిక జరిగింది.
 
 జె. ఎడ్జర్ హూవర్ బిల్డింగ్

ఇది అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రధాన కార్యాలయం. వాషింగ్టన్ డి.సిలో ఉన్న ఈ బిల్డింగ్‌ను అక్కడి ప్రజలు అతిచెత్త బిల్డింగ్‌గా భావిస్తారు. వాషింగ్టన్ నగర నిర్మాణం, ప్రణాళిక ప్రకారం ఇది ఎంతమాత్రం నగరంలోని ఇతర బిల్డింగులతో పోటీపడగల స్థాయి కాదని వారి అంచనా. అయితే ఈ బిల్డింగులో సెక్యూరిటీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ ఫ్లోరింగ్ తదితర సౌకర్యాలున్నప్పటికీ ఇది ప్రపంచంలోని చెత్త బిల్డింగుల్లో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఇది చాలా ఏళ్ల క్రితం నిర్మించినదవడం వల్ల ఈ బిల్డింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.
 
 రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియమ్
 అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఇది ఓ పురాతన మ్యూజియం. అనేక చారిత్రక సంపదను దాచుకున్న ఈ బిల్డింగ్ దాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్‌లకే అంతగా నచ్చలేదు. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేసరికి కనిపించిన లోపాలు, ఆకారాల్లో తేడాలు వంటివల్ల ఇది అంతగా ఆకట్టుకోదు.

 షార్ప్ సెంటర్ ఫర్ డిజైన్
కెనడాలోని టొరంటోలో ఉన్న ఈ బిల్డింగ్‌కి ప్రపంచ చెత్త బిల్డింగుల్లో ఒకటిగా చోటు దక్కింది. ఇది ఒంటారియో ఆర్ట్ అండ్ డిజైన్ కాలేజ్ బిల్డింగ్. పై అంతస్థులు రోడ్డు మీదికి చొచ్చుకొచ్చినట్లుగా ఉండే ఈ బిల్డింగును కొందరు సృజనాత్మకమైనదిగా భావిస్తారు. మరికొందరు మాత్రం అసహ్యమైనదని అంటారు. బ్రిటీష్‌కు చెందిన ఆర్కిటెక్ట్స్, టొరంటోకు చెందిన నిర్మాణ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి.
 
 ఓయామా టెక్నికల్ కాలేజ్
 జపాన్ రాజధాని టోక్యోలోని షిబుయా ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగ్ ప్రపంచ చెత్త బిల్డింగుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఆధునిక యుగానికి ముందుగా జపాన్‌లో నిర్మితమైన ఓ వింత ఆకారంలో ఉండే బిల్డింగ్. ఇది అనేక పదునుగా మొనదేలినట్టుండే మూలలవంటి నిర్మాణాల్ని కలిగి, ఎరుపు, వెండి వంటి రంగుల్లో ఉంది. ఇది పూర్తిగా లోహంతో నిర్మాణమైనట్లుగా కనిపిస్తుంది. సాధారణ బిల్డింగ్‌లాగా కనిపించకుండా ఒక రోబో మిషన్‌లాగా అనిపించడం ఈ బిల్డింగ్ ప్రత్యేకత. ఇటీవల దీనికి చెత్త బిల్డింగుల్లో ఒకటిగా నిలిచినప్పటికీ దీనికిగల వెరైటీ డిజైనింగ్ వల్ల చిత్రంగా 1988లో ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ రావగం గమనార్హం.
 
 గీజిల్ లైబ్రరీ

 ప్రపంచ చెత్త బిల్డింగుల్లో ఐదో స్థానంలో నిలిచిన గీజిల్ లైబ్రరీ కూడా అమెరికాకు చెందినదే. శాన్‌డిగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రాంగణంలో ఉన్న దీని నిర్మాణం, ఆకారం వింతగా ఉంటాయి. సాధారణ బిల్డింగుల్లా నిలువుగా కాకుండా విచిత్రంగా ఉంటుంది. ఈ బిల్డింగ్‌ను యూనివర్సిటీ లోగోలో కూడా చూడొచ్చు. అసాధారణంగా ఉన్న దీని నిర్మాణం వల్ల ఈ బిల్డింగ్‌కు చెత్త బిల్డింగ్‌గా చోటు దక్కింది.
 
 చాంగ్ బిల్డింగ్
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఉన్న ఈ బిల్డింగ్ వరస్ట్ బిల్డింగ్స్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. దీని నిర్మాణం నడుచుకుంటూ వెళ్తున్న ఎలిఫెంట్ ఆకారంలో ఉండడంవల్ల స్థానికంగా దీన్ని ఎలిఫెంట్ టవర్ అంటారు. దీనికున్న భిన్నమైన ఆకారం వల్ల ఇది ఈ జాబితాలో చోటు సంపాదించింది. ఈ బిల్డింగ్‌లో ఆఫీసులు, వ్యాపార సముదాయాలతో పాటు, రెసిడెన్షియల్ హౌజ్‌లు కూడా ఉన్నాయి.
 
 ఎపి అపార్ట్‌మెంట్స్
అమెరికాలోని సీటిల్ ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగుల్ని చూడగానే ఇది మధ్యలో కూలిపోతుందా అన్నట్లుంటుంది. మధ్యలో ఓ వైపు ఒరిగిపోతుందా అనిపించేలా వింతగా చేపట్టిన దీని నిర్మాణమే ఎపి అపార్ట్‌మెంట్‌కు ఈ జాబితాలో చోటు దక్కేలా చేసింది. ఈ బిల్డింగ్‌కి చివరలో అమర్చిన వింత ఆకారపు నిర్మాణాలు కూడా బిల్డింగ్ ప్రత్యేకతను తెలియజేస్తాయి. సౌందర్యం, కొత్తదనం కోసమే ఈ నిర్మాణం జరిగినా ఇది ప్రపంచపు వరస్ట్ బిల్డింగ్‌లలో స్థానం సంపాదించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement