
పుష్కరాల్లో విద్యార్థుల మృతిపై విచారణ: డీజీపీ
కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న విషాదంపై పోలీసు కేసు నమోదైంది. పుష్కర స్నానాల కోసం వెళ్లి.. కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతిపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
విద్యార్థుల మృతి దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనధికార పుష్కర ఘాట్లను పూర్తిగా నియంత్రిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆరు రోజుల్లో మొత్తం 74 లక్షల మంది పుష్కర స్నానం చేశారని, శుక్రవారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు.