సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికారులు జడత్వాన్ని, నిర్లక్ష్యాన్ని వీడితేనే ప్రజలు కోరుకున్న విధంగా పాలనలో మార్పులు తీసుకు రావడానికి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. విధాన సౌధలో మంగళవారం జరిగిన వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీల సీఈఓల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అధికారులు బాధ్యతా రహితంగా వ్యవహరించడాన్ని ఏ మాత్రం సహించలేమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆశయాలు, పథకాలను పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత జూలైలో జరిగిన సమావేశంలో పాలనా యంత్రాంగం లో చురుకు పుట్టించాలని సూచనలు చేశానని గుర్తు చేశారు. అయితే ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారనే అంశాలపై సమాచారమే రాలేదని నిష్టూరమాడారు. కొందరు జిల్లా కలెక్టర్లు సమాచారమే ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఆశించినా, ఆ దిశగా ఎలాంటి మార్పులు రాలేదని విచారం వ్యక్తం చేశారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమగ్ర పథకాలను రూపొందించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను కాల పరిమితితో పరిష్కరించాలని ఆదేశించారు. ఆహార ధాన్యాల ధరలను పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వీడండి
Published Thu, Jan 23 2014 3:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement