‘చేయి’కి ఊతమెవరో..
‘చేయి’కి ఊతమెవరో..
Published Thu, Mar 6 2014 10:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్‌కు మారుపేరుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళ గవర్నర్‌గా నియమించడంతో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఎవరు పార్టీకి నేతృత్వం వహిస్తారన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లకు సుపరిచితమైన షీలాదీక్షిత్‌ను కేరళ గవర్నర్‌గా నియమించి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలకు ముందే పరాజయాన్ని అంగీకరించిందని పార్టీ విమర్శకులు అంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లాలంటే ఓటర్లకు చిరపరిచితమైన వ్యక్తి నాయకత్వం కావాల్సి ఉంటుంది. షీలాదీక్షిత్ లోటును కాంగ్రెస్‌లో ఎవరు పూరిస్తారన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల షీలా ఏకచత్రాధిపత్యంలో ఢిల్లీ కాంగ్రెస్ నేతలంతా ప్రజల ముందు అనామకులుగానే మిగిలిపోయారు. ఆమె మర్రి చెట్టు చందమని... తన నీడలో మరో కాంగ్రెస్ నేతను ఎదగనీయలేదని అప్పట్లో విమర్శలు ఉన్నాయి.
ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్‌లో పేరొందిన నాయకులుండేవారు. జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్, దీప్ చంద్ బంధూ, హెచ్‌కెఎల్ భగత్, ఆర్‌కె ధావన్, జగ్‌ప్రవేశ్ శర్మ, రాంబాబు శర్మ... వంటి హేమాహేమీలు ఢిల్లీ కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించేవారు. జగ్‌దీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటివారితో పాటు కపిల్ సిబల్, అజయ్ మాకెన్, జైప్రకాశ్ అగర్వాల్ తదితరులు ఇప్పటికీ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ షీలాదీక్షిత్ మాదిరిగా పార్టీని ఒక్కతాటిపై నడిపించగల సత్తా వీరికెవరికీ లేదు. సిక్కు అల్లర్ల అనంతరం జగదీశ్ టైట్లర్,సజ్జన్ కుమార్‌ల రాజకీయ జీవితం చిక్కుల్లో పడింది. మొత్తం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపెకైత్తుకునే ప్రజాదరణ కపిల్ సిబల్ కు లేదు. చాందినీచౌక్ నుంచి గెలుపుకే ఆయన సర్వశక్తులు ఒడ్డవలసిన పరిస్థితి. ఇక అజయ్ మాకెన్, జైప్రకాశ్ అగర్వాల్ విషయానికి వస్తే షీలాదీక్షిత్ ప్రాభవంలో సైతం అధిష్టానం వద్ద కొద్దో గొప్పో గుర్తింపు పొందిన నాయకులుగా చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జై ప్రకాశ్ అగర్వాల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన ఆయనకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అప్పగించే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అగర్వాల్‌తో పోలిస్తే అజయ్ మాకెన్ కొంతవరకు షీలాకు దీటైన నేతగా గుర్తింపు పొందారు. మాకెన్‌కున్న ఈ గుర్తింపు దృష్ట్యా రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ఆయననే ప్రచారంలో ముందుంచవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అర్వీందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలోనే పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జరపవచ్చని మరికొందరు అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల అనుకూల పవనాలు గట్టిగా వీస్తున్న సమయంలోనూ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అర్వీందర్ సింగ్ లవ్లీకి పార్టీని ముందుండి నడిపించడంలో సమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయన్నది అనుమానాస్పదమే. మాకెన్‌ను పక్కనబెట్టి ఆయన విధేయుడిగా ముద్రపడిన లవ్లీకి పార్టీ ప్రచార బాధ్యతను అప్పగించకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
Advertisement
Advertisement