‘నకిలీ’ గుట్టు రట్టు
సాక్షి, చెన్నై:ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేస్తున్న ముఠా గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. కొడుంగయూర్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బీఈ నకిలీ సర్టిఫికెట్లను రూ.30 వేలు చొప్పున ఈ ముఠా విక్రయించినట్టు విచారణలో తేలింది. ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, భారీగా వివిధ విద్యాసంస్థల నకిలీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోవిద్యాసంస్థలకు కొదువ లేదు. అరుుతే చదువుల్లో రాణించే విద్యార్థులు కొందరు అయితే, పుస్తకాల్ని పక్కన పెట్టి ఎంజాయ్‌మెంట్ లక్ష్యంగా పరుగులు తీసేవాళ్లు మరి కొందరు. మార్కులు తగ్గిన పక్షంలో తల్లి దండ్రుల నుంచి చీవాట్లు తప్పదు.
అలాగే, ఉన్నత చదువుల నిమిత్తం కాస్త మార్కులు తగ్గితే, ఎక్కడ సీట్లు కోల్పోతామోనన్న ఆందోళన మరి కొందరిది. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకుని కొడుంగయూర్ వేదికగా రెండేళ్లుగా విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి చెలామణి చేస్తూ వచ్చిన ముఠా గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు.పట్టుబడింది ఇలా..: రెండు రోజుల క్రితం నుంగబాక్కం కాలేజ్ రోడ్డులోని డీపీఐకు కూతవేటు దూరంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కమిషనర్ జార్జ్ ఆదేశాలతో క్రైం బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఏకే రాజశేఖర్ నేతృత్వంలోని బృందం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించింది. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో నకిలీ బీఈ సర్టిఫికెట్లు ఉండటంతో విచారణ వేగవంతం చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో కొడుంగయూర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్లు ముఠా గుట్టు రట్టు అయింది.
భారీగా సర్టిఫికెట్లు : ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో కొడుంగయూర్ వళ్లలార్ నగర్‌లోని ఓ ఇంటిపై ప్రత్యేక బృందం దాడి చేసింది. అక్కడున్న అత్యాధునిక టెక్నాలజీ, స్టాంపుల్ని, సీల్స్, స్టిక్కర్లను చూసి అధికారులు విస్మయంలో పడ్డారు. మద్రాసు వర్సిటీ, అన్నా వర్సిటీ, రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు, శిక్షణా కేంద్రాల సర్టిఫికెట్లు బయట పడ్డాయి. సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకుని, అడిగిన వారికి కావాల్సినంత మార్కులు, పేర్లు ముద్రించి వెనువెంటనే అప్పగించే విధంగా అక్కడ సరంజామా సిద్ధం చేయటం వెలుగు చూసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్లు, సీపీయూలు, లామినేషన్స్, లేజర్ పరికరాలు, కలర్ డిజైనింగ్ ప్రింటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.15 వేలు నుంచి రూ.30 వేలకు విక్రయించినట్టు తేలింది. బెంగళూరులోని కొందరు బ్రోకర్ల సాయంతో అక్కడకు కూడా ఈ నకిలీ రాకెట్ విస్తరించినట్టు బయట పడింది. దీంతో ఆ బ్రోకర్ల భరతం పట్టే రీతిలో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
అరెస్టు: ఈ రాకెట్ సాగిస్తున్న గౌతమన్ ఆయన కుమారుడు లోకేష్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురిని, స్వాధీనం చేసుకున్న అత్యాధునిక పరికరాలు, సర్టిఫికెట్లను మీడియా సమావేశంలో గురువారం ప్రవేశ పెట్టారు. ఈ గౌతమన్ ఇది వరకు డీపీఐలో అసిస్టెంట్ అధికారిగా పనిచేసినట్టు వెలుగు చూసింది. విద్యా విభాగాలతో డీపీఐ నిండిన దృష్ట్యా, అక్కడి వ్యవహారాల మీద గౌతమన్‌కు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఈ రాకెట్‌ను గుట్టుచప్పుడు కాకుండా నడిపేందుకు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలను కల్గిన గౌతమన్ ఇది వరకు ఓ మారు నకిలీ సర్టిఫికెట్లతో పట్టుబడి జైలు జీవితాన్ని అనుభవించినట్టు విచారణలో తేలిందన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక, కంప్యూటర్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన తనయుడు లోకేష్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను సిద్ధం చేసి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగి చివరకు తమకు చిక్కాడని ప్రత్యేక బృందం అధికారులు పేర్కొన్నారు.