ఉరిశిక్ష ఇతివృత్తంగా పొరంబోకు
ఉరిశిక్ష అవసరం? కాదా? అన్న అంశాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌పీ జననాథన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈయన ఫస్ట్‌కాపీ బేస్‌డ్ మీద యూటీవీకి సంస్థకు చేసి పెట్టారు. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్, కార్తీకలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ముందుగా దర్శకుడు ఎస్‌పి జననాథన్ మాట్లాడుతూ పొరంబోకు చిత్రాన్ని ఫస్ట్‌కాపీ విధానంలో యూటీవీ సంస్థకు చేశానని తెలిపారు. దీంతో బాధ్యత పెరిగిన విషయం నిజమేనని అయితే పూర్తి స్వేచ్ఛ లభించిందని అన్నారు.
తాను అనుకున్న విధంగా చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందించానని తెలిపారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఉరిశిక్షకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. వారిలో పలు కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను సుదీర్ఘంగా చర్చించి తయారు చేసిన కథా చిత్రం పొరంబోకు అని వివరించారు. అసలు ఇలాంటి ఉరిశిక్షలు అవసరమా? కాదా? అన్న విషయాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆర్య ఒక విప్లవకారుడి పాత్రను పోషించారని చెప్పారు. విప్లవకారుడనగానే నల్లదుస్తులు, పెరిగిన గడ్డం, మీసాల వేషధారణలతోనే సినిమాల్లో చూపించారన్నారు.
దాన్ని మార్చాలనే ఆర్య ఈ చిత్రంలో విభిన్నంగా చూపించమని అన్నారు. కారణం భగత్‌సింగ్ లాంటి విప్లవ వీరులు చాలా అందంగా ఉండేవారన్నారు. అదే విధంగా నటుడు శ్యామ్‌ను పోలీసు అధికారిగాను, విజయ్‌సేతుపతిని ఒక వైవిధ్య భరిత పాత్రలోనూ చూపించామని పేర్కొన్నారు. నటి కార్తీకాను కుయిలి అనే పోరాట యోధిని పాత్రలో నటింప చేశామని చెప్పారు. ఇప్పటి వరకు అందమైన యువతి పాత్రలో నటించిన కార్తీకను ఈ చిత్రంలో యాక్షన్ నాయకిగా చూపించామని తెలిపారు. ఇది మల్టీస్టారర్ చిత్రం కావడంతో మొదట్లో కాస్త భయపడినా ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ ముగ్గురు ఎలాంటి ఈగో లేకుండా నటించడంతో తాననుకున్నది తెరపై చూపించగలిగానని దర్శకుడు జననాథన్ అన్నారు.