సంబరాల్లో ఏపీ కాంగ్రెస్
సంబరాల్లో ఏపీ కాంగ్రెస్
Published Sat, Mar 11 2017 4:45 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
హైదరాబాద్: గత ఎన్నికలతో పోల్చితే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడుతోందని ఏపీ పీసీసీ అధ్యకుడు ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మరుగున పడ్డాయని, జాతీయ పార్టీలు బలపడ్డాయని చెప్పారు. యూపీలో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని విశ్లేషించారు. నరేంద్ర మోదీ తరహాలో ఏ ప్రధానమంత్రి కూడా ఒక రాష్ట్రంలో 45 రోజుల పాటు ప్రచారం నిర్వహించలేదని, ఆ రకంగా చూస్తే బీజేపీ నైతికంగా ఓడిపోయినట్టేనని రఘువీరా చెప్పారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు రావడంపై ఆంధ్ర రత్న భవన్ లో కాంగ్రెస్ శనివారం విజయోత్సవ సంబరాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడారు. 2014 తో పోలిస్తే కాంగ్రెస్ అనూహ్యంగా బలపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడుకు అగ్ని పరీక మొదలైందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ యూపీలో రుణ మాఫీ చేస్తే ఏపీలో చంద్రబాబు చేతకానివాడిలా మిగిలిపోతాడని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎంకు పరీక్ష అని అన్నారు. 2019 లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
Advertisement