
సాగనంపుదాం!
♦ చిత్తశుద్ధి లేని సీఎం అవసరమా
♦ జయను ఉద్దేశించి రాహుల్ విసుర్లు
♦ అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు
♦ మదురైలో రాహుల్, స్టాలిన్
♦ మా ఇద్దరిదీ ఒకటే మార్గం అని వ్యాఖ్య
♦ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన
నాలుగు గోడల మధ్య నుంచే, అన్నీ తెలుసు..అన్నట్టు నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ సీఎం అవసరమా? ఇక, సాగనంపుదాం.. తమిళనాడును బలోపేతం చేసుకుందామని ప్రజలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం తమిళనాట సుడిగాలి పర్యటనల్లో సీఎం జయలలితను టార్గెట్ చేసి, అప్పుడప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి ప్రసంగాల్ని రాహుల్ హోరెత్తించారు. కామరాజర్, ఎంజీయార్ వంటి నేతల జాబితాలో స్టాలిన్ కూడా ఉన్నారంటూ వ్యాఖ్యానించి డీఎంకే వర్గాల్లో మరింత జోష్‌ను నింపారు.
సాక్షి, చెన్నై: డీఎంకే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన రాకతో మదురై, కోయంబత్తూరు, చెన్నైలలో భద్రతను పెంచారు. ఆయన బహిరంగ సభ జరిగిన ప్రదేశాల్లో డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు తరలివచ్చి తమ కూటమి బంధాన్ని చాటుకున్నారు. ఊమచ్చికులం వేదికగా జరిగిన బహిరంగ సభ నిమిత్తం రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మదురైకు చేరుకున్నారు. అక్కడి కాంగ్రెస్ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. ఇద్దరు నవతరం నాయకుల్ని ఒకే వేదిక మీద చూసి డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు ఆనందంలో మునిగాయి.
రాహుల్, స్టాలిన్ ఊమచ్చికులం వేదికగా జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకే సర్కారును గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్టాలిన్‌ను కలిసానని, అయితే, ఇక్కడ ఒకే వేదిక మీద ఇద్దరం ప్రచారం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కామరాజర్, ఎంజీయార్ వంటి నేతలు ప్రజల మధ్యలో పరుగులు తీస్తుంటారని, ఆ కోవలో స్టాలిన్ కూడా ఉన్నారని కితాబు ఇచ్చారు. తామిద్దరం ఒకే మార్గంలో పయనిస్తున్నామని ప్రజా హితం తమ లక్ష్యం అని వ్యాఖ్యానించారు. తదుపరి కోయంబత్తూరు కొడీస్సియ మైదానంలో జరిగిన బహిరంగ సభలో డిఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళితో కలిసి ఓట్ల వేట సాగించారు. ఇక్కడ ముగియగానే, ఆగమేఘాలపై చెన్నైకు చేరుకున్నారు. వానగరంలోని ఓ మైదానంలో జరిగిన బహిరంగ సభలో డిఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌తో కలసి ప్రజాకర్షణ ప్రసంగాన్ని రాహుల్ హోరెత్తించారు.
సాగనంపుదాం : మదురై, కోయంబత్తూరు, చెన్నై సభల్లో రాహుల్ తన ప్రసంగం అంతా అన్నాడిఎంకే అధినేత్రి, సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగా విరుచుకు పడ్డారు. మధ్య మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన తీసుకొస్తూ శివాలెత్తారు. కామరాజర్, కరుణానిధి, ఎంజీయార్ వంటి నాయకులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని ఇక్కడ పరిష్కరించి ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఇక్కడున్న సీఎం నాలుగు గోడలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. ఆ గోడల మధ్య ఉంటూ, అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని శివాలెత్తారు.
తమిళనాడు దేశంలోనే బలమైన రాష్ట్రంగా ఐదేళ్ల క్రితం ఉన్నదని, అయితే, ఈ కాలంలో బలహీనం చేశారని ధ్వజమెత్తారు. ఈ కాలంలో ఇక్కడకు రావాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారని, పెట్టుబడి పెట్టే ముందు, ఇక్కడి పాలకులకు చేతుల్ని తడపాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నదని మండి పడ్డారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో డిఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ నెలకొల్ప బడ్డ పరిశ్రమల్ని బలవంతంగా మూయించడం మొదలెట్టి, పట్టభద్రుల్ని నిరుద్యోగులుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, వరద ప్రళయంలో చిక్కుకుని నరకాన్ని చవి చూసి ఉంటే, వాటి గురించి పట్టించుకోకుండా నాలుగు గోడల మధ్య నుంచి ప్రేక్షక పాత్ర పోషించిన ఈ సీఎం అవసరమా...? అవసరమా..? అని పదే పదే వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో వద్దు..వద్దు అనిపిస్తూ ప్రసంగాన్ని సాగించారు.
బలంగా ఉన్న తమిళనాడును బలహీనం చేశారని, ఇప్పుడు బలమైన నాయకత్వంతో బలోపేతం చేసుకుందామని, అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు. రూ ఐదువేలు విలువగల ఉచితాల్ని ఇచ్చేసి, మద్యం రూపంలో ఒక్క కుటుంబం నుంచి రూ. 60 వేలు చొప్పు దోచుకున్న ఈ ప్రభుత్వాన్ని ఇక సాగనంపుదామన్నారు. జయలలిత జీ(గారు)....ఏమో..! నాలుగు గోడలకు పరిమితం...మోదీ..జీ ఏమోగా దేశంలోనే ఉండరంటూ, ఈ ఇద్దరూ ప్రజా వ్యతిరేకులు అని, వీరికి ప్రజా హితం గిట్టదంటూ ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలను అణగదొక్కడే లక్ష్యంగా ఈ ఇద్దరి పయనం ఉన్నదని, వీరికి ఏ మాత్రం ప్రజల మీద చిత్తశుద్ది అన్నది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకే, కాంగ్రెస్‌లు ఇచ్చిన వాగ్దానాలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అమలు చేసి తీరుతాం అని మేనిఫెస్టోల్లోని అంశాలను కొన్ని వివరించారు.
రాష్ట్రంలో మద్యనిషేధం తప్పని సరిగా అమలు అవుతుందని పేర్కొంటూ, తనకు సత్య అనే తొమ్మిది సంవత్సరాల బాలిక ద్వారా ఎదురైన అనుభవం, మద్యం రక్కసితో ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడం, చివరకు సత్య అనాథగా మిగలడం గురించి వివరించారు. మరో సత్య ఇక్కడ అనాద మార కూడదని, అందుకే మద్య నిషేధం లక్ష్యంగా బలమైన నాయకత్వాన్ని బల పరుద్దామని పిలుపు నిచ్చారు. జయ...జీకి మాత్రం పగ్గాలు ఇస్తే, ఇలాంటి సత్యలు రాష్ట్రంలో పెరుగుతారన్నది గుర్తుంచుకోవాలని, ప్రజాల కష్టాల్ని గుర్తించే నాయకుల్ని, ప్రజల్లో మమేకం అయ్యే నాయకత్వాన్ని బలపరుద్దామని, సమిష్టిగా రాష్ట్రంలో అధికారం సాధిద్దామని పిలుపు నిచ్చారు.
కాగా, మదురైలో రాహుల్ ప్రసంగాన్ని ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు అనువాదించే క్రమంలో ఆయన మైక్ మూగబోయింది. తక్షనం ఆయన్ను తన పక్కకు లాక్కుని మైక్ అందించిన రాహుల్, ఇంత దగ్గర్లో నాయకులు జయ... జీ వద్ద నిలబడ గలరా..?, చెప్పండి...అదే వారికి తమకు ఉన్న తేడా, ఇదే తమ నాయకత్వం అంటూ చేసిన వ్యాఖ్యలకు జనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. కోయంబత్తూరు సభలో అయితే, మరో కార్యదర్శి జయకుమార్ ప్రసంగం అనువాదంలో తడబడడంతో పదే పదే ఆయనకు అంశాలను రాహుల్ గుర్తు చేస్తూ జనం చేత చప్పట్లు కొట్టించారు.
ఇక, మదురై వేదికగా వణక్కం ‘స్టాలిన్’ అవర్గలే (నమస్తే స్టాలిన్ గారు) అని దళపతిని తమిళంలో కతృజ్ఞత పూర్వక ఆహ్వానం పలికారు. రాహుల్ రాకతో కాంగ్రెస్‌లో ఐక్యత వికసించినట్టుగా, నేతలందరూ వేదికల మీద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, దళపతి స్టాలిన్ తన ప్రసంగంలో జయలలిత తీరును ఎండగడుతూ ముందుకు సాగారు.