గవర్నర్ బంగ్లా వద్ద పోలీసు బందోబస్తు
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన రాజ్‌భవన్ కార్యకలాపాలు ఆధ్యంతం వివాదాస్పదంగా మారిపోయాయి. నారూటే..సెపరేటు అన్నట్లుగా ఆయన వ్యవహారశైలితో రాజ్‌భవన్‌రచ్చబండగా మారిపోయింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా 2017 అక్టోబర్ 6న బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే రాజ్‌భవన్‌లో మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారాన్ని నేను ముట్టను, మరెవ్వరినీ ముట్టనివ్వను అని హుకుం జారీచేశారు. రాజ్‌భవన్‌కు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే అతిథులకు సైతం స్వచ్ఛమైన శాఖాహారమేనని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ సిబ్బంది సైతం తమ లంచ్ బాక్సుల్లో మాంసాహారం తీసుకురాకూడదు, ఒక వేళ తినాలనిపిస్తే బైటకు వెళ్లి ఆరగించిరండి అంటూ ఆదేశించి రాజ్‌భవన్‌ను వెజ్‌భవన్‌గా మార్చివేశారు. ఈ ఆదేశాలకు లోలోన గొణుక్కున్నవారు లేకపోలేదు. ఇక ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. గవర్నర్ సమీక్షలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ సమీక్షలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. రామనాథపురం జిల్లా పర్యటనలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా గవర్నర్ తొంగిచూసాడంటూ కలకలం రేగింది. స్థానికులు గవర్నర్‌ను చుట్టుముట్టి నిలదీయడంతో సెక్యూరిటీ గార్డులు ఆయనను అర్ధంతరంగా కారులో ఎక్కించి కాపాడారు.
తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం సైతం గవర్నర్ మెడకు చుట్టుకుంది. కళాశాల విద్యార్థినులను లైంగికంగా ప్రలోభపెట్టేందుకు నిర్మలాదేవి జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల్లో గవర్నర్ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై నిర్మలాదేవి అరెస్టయిన అదే రోజు సాయంత్రానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానంతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించారు. గవర్నర్ హడావుడిని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు అనుమానించాయి. పోలీసులు, మదురై కామరాజ్ యూనివర్సిటీ ఈ వ్యవహారంలో నిగ్గుతేల్చాల్సి ఉండగా గవర్నర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంలోని మర్మమేమని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశం పెట్టి తనపై పడిన మచ్చను తొలగించుకునే ప్రయత్నంలో గవర్నర్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ఆమె చెంపను సుతారంగా నిమరడంతో జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి.
దీంతో మరోసారి కంగారుపడిన గవర్నర్ సదరు మహిళా విలేకరికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అనేక గందరగోళాల మధ్య అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్ణాటకకు చెందిన సూరప్పను నియమించి మరో రచ్చకు తెరదీశారు. కళాశాల విద్యార్థినులపై లైంగిక ప్రలో భాలకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పదవి నుంచి తప్పుకోవాలని లేదా కేంద్రం రీకాల్ చేయాలని, సూరప్ప నియామకాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ప్రతిపక్షాల ఆందోళనలకు గవర్నర్ బంగ్లా శాశ్వత చిరునామాగా మారడం, ముట్టడి యత్నాలు కొనసాగుతున్నందున సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఇద్దరు సహాయ కమిషనర్లు, ఇద్దరు అదనపు కమిషనర్లు వెయ్యిమంది ఇతర పోలీసు అధికారులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్ బంగ్లాలోకి వెళ్లే రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధంగా ఉంచుకున్నారు. రాజ్‌భవన్ సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారిని మాత్రమే గవర్నర్ బంగ్లాలోకి అనుమతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment