ప్రతి ఇంటికొస్తా
సాక్షి, చెన్నై: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దయతో అధికార పగ్గాలు చేపట్టే ప్రభుత్వం ఏర్పడటం తథ్యం’ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులెవ్వరూ తన కోసం రావొద్దని, తానే ప్రతి ఇంటి గడప తొక్కుతాననని స్పష్టం చేశారు. రజనీ, కమల్‌కు రాజకీయాలు అవసరం లేదని, ఆ ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదన్నారు. సత్యమూర్తి భవన్ శనివారం కార్యకర్తల సందడిలో మునిగింది. ఈవీకేఎస్‌కు మద్దతు తెలిపేందుకు పెద్దఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. తంజావూరు, నాగపట్నం విల్లుపురం తదితర జిల్లా ల నుంచి తన కోసం తరలివచ్చిన వాళ్లను చూసి ఈవీకేఎస్ ఉద్వేగానికి లోనయ్యారు. తన కోసం శ్రమ పడి ఇక్కడికి రావొద్దని, ప్రతి కార్యకర్త ఇంటికి తానే స్వయంగా వస్తానని ప్రకటించారు.
అనంత రం మీడియాతో ఈవీకేఎస్ మాట్లాడుతూ, రాష్ట్రం లో అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి కాంగ్రెస్‌ను బలోపేతం చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. దాడి కి ప్రతి దాడి: కాంగ్రెస్ కార్యాలయాన్ని వాసన్ మద్దతుదారులు కైవశం చేసుకోవడంపై ఆయన మాట్లాడుతూ, దాడులు, బలవంతాలు, బెదిరింపులను వాసన్ ప్రోత్సహించరని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ మార్గాన్ని ఆయన ఎంచుకుంటే, ఎదుర్కొనేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగాల్సి ఉం టుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరి బలం ఎంతోనన్న విషయం వారం రోజుల్లో తేలనుందని చెప్పారు. ఇక్కడికి వచ్చే కార్యకర్తలు, నాయకులను చూస్తుంటే, 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గా లు చేపట్టడం ఖాయం అన్న ధీమా కలుగుతోందన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ రేయింబ వళ్లు శ్రమిస్తే అధికార పగ్గాలు చేపట్టడమా, లేదా తమ దయతో రాష్ర్టంలో ప్రభుత్వం అధికారంలోకి రావడమా? అన్నది తేలిపోతుందన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా తాను పర్యటిస్తానని, ప్రతి నాయకుడి ఇంటి కి, కార్యకర్త ఇంటికి వెళ్లనున్నానని చెప్పారు. ఎన్నికల్లో నిలబడి గెలిచి పదవుల్ని చేజిక్కించుకోలేని వాళ్లంతా, ఇప్పుడు పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం హాస్యాస్పదంగా ఉందని పరోక్షంగా జీకేవాసన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రం సంధించారు.
పోరాటం : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కాబోతోందన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతోనే ఉండి, వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిశీలించే దిశగా కొత్త వ్యూహాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలు ప్రజల నడ్డి విరిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగురు తమిళుల విడుదల లక్ష్యంగా శ్రీలంకపై కొరఢా ఝుళిపించకుండా, మోదీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడం శోచనీయమన్నారు. భారత్ తలచుకుంటే, రాజపక్సేను పదవీచ్యుతుడ్ని చేయగలదని, అలాంటి చర్యలకు మోదీ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఆస్తుల్ని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, కాంగ్రెస్ ట్రస్టు నుంచి వాసన్‌ను తొలగించి జయంతి నటరాజన్, యశోదను నియమించినట్లు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మంచిదన్నారు. కమల్ కూడా రాజకీయాల్లోకి రాకూడదన్నారు. కమల్ ఎవరి ఉచ్చులోనూ అంత సులభంగా చిక్కడని, ఆయన మహా మేధావి అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు.