E.V.K.S.Elangovan
-
ఢిల్లీకి ఈవీకేఎస్
సాక్షి, చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీకి పరుగులు తీశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశ మయ్యారు. త్వరలో ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన, రాహుల్ ప్రచార పర్యటనల కసరత్తుల మీద ఈ భేటీ సాగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. కోల్పోయిన బలాన్ని మళ్లీ చాటుకోవడం లక్ష్యంగా ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఇందు కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరికొత్త బాటలో, కొత్త వ్యూహాలతో పయనం సాగించే పనిలో పడ్డారు. అందరి కన్నా భిన్నంగా ఇంటర్వ్యూల పర్వానికి బుధవారం శ్రీకారం చుట్టించారు. అయితే, కొన్ని జిల్లాల్లో మిశ్రమ స్పందన రావడంతో రాహుల్‌కు ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో గ్రూపు రాజకీయాలతో ఆశావహుల ఇంటర్వ్యూల పర్వం మీద ప్రభావాన్ని చూపడంతో వ్యవహారం ఆగమేఘాల మీద ఢిల్లీకి చేరింది. దీంతో ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుంది. పిలుపుతో ఆయన పరుగులతో విమానం ఎక్కేశారు. ఢిల్లీకి పరుగు : ఢిల్లీకి చేరుకున్న ఈవీకేఎస్ ఇళంగోవన్ ఉదయాన్నే రాహుల్ గాంధితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి , దరఖాస్తులు, ఆశావహుల వివరాలతో నివేదికను రాహుల్‌కు ఈవీకేఎస్ సమర్పించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన ఆదేశాల్ని ధిక్కరించే విధంగా ఇంటర్వ్యూలను బహిష్కరించిన వారి వివరాలను రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. ఎన్నికల వ్యవహారాలను వేగవంతం చేయడంతో పాటుగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందు కు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించేందుకు రాహుల్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కమిటీలో చిదంబరం, తంగబాలుతో పాటుగా అన్ని గ్రూపుల నేతల్ని ఒకే వేదిక మీదకు తీసుకు రావడం, తన ఎన్నికల ప్రచార పర్యటన ఏ విధంగా ఉండాలో అన్న అంశాల్ని వివరించినట్టు తెలిసింది. తన తండ్రి రాజీవ్ గతంలో ఏ విధంగా పర్యటనల్ని సాగించారో, అదే తరహాలో పర్యటన సాగే విధంగా రూపకల్పనకు రాహుల్ సూచించి ఉన్నట్టుగా ఈవీకేఎస్ మద్దతు దారులు పేర్కొంటున్నారు. బహిరంగ సభల రూపంలో కన్నా, గ్రామ గ్రామాన తిరగడం ద్వారానే ఓట్లను రాబట్టవచ్చన్న కాంక్షతో రాహుల్ పర్యటన రాష్ట్రంలో సాగే అవకాశాలు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక, మార్చి 20వ తేదీ ద్రవిడ కళగం నేతృత్వంలో జరగనున్న ప్రజా న్యాయ మహానాడుకు హాజరు అయ్యే విషయంగా ఈ భేటీలో చర్చ సాగినట్టు చెబుతున్నారు. ఈ మహానాడుకు కరుణానిధి, బీహార్ సీఎం నితీష్‌కుమార్, లాలుప్రసాద్ యాదవ్ సైతం హాజరు కానున్న దృష్ట్యా, రాహుల్ సైతం ప్రత్యక్షం అయ్యే అవకాశాలు ఉన్నాయని, త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన, ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే కార్యక్రమాలు సాగబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. -
మోదీ రాజవంశీయుడా?’
ప్రధాని నరేంద్ర మోదీ రాజవంశీయుడిలాగా వ్యవహరిస్తూ అరగంటకో డ్రెస్ మార్చడం శోచనీయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ విమర్శించారు. పాలనపై ఆయనకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు. సాక్షి, చెన్నై :వంద రోజుల ఉపాధి హామీ పథకంతోపాటు యూపీఏ ప్రభుత్వ పథకాలకు మంగళం పాడేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమ పథకాల్ని తుంగలో తొక్కేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. చెన్నై కలెక్టరేట్ ఆవరణలో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలో ఆందోళన చేశారు. ఈ నిరసనలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. రాజ వంశీయుడా..: సంపన్న దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వివరిస్తూ, ఈ సమయంలో నరేంద్ర మోదీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని శివాలెత్తారు. రోజంతా ఒబామా ఒకే డ్రెస్సుతో ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ అరగంటకో డ్రె స్సులో కనిపించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకానికి ఐక్యరాజ్య సమితి సైతం కితాబిచ్చిందని గుర్తు చేస్తూ, అలాంటి పథకానికి మంగళం పాడేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో 550 డివిజన్లలో ఈ పథకం అమల్లో ఉండేదని, అయితే, ఇప్పుడు 64 డివిజన్లకు పరిమితం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. హంగు ఆర్బాటాలకే మోదీ పరిమితం అయ్యారేగానీ, ప్రజల కోసం ఆయన చేసింది శూన్యం అని ధ్వజమెత్తారు. అరగంటకో డ్రెస్సు మార్చడం కాదని, ప్రజల్లోకి వచ్చి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ పథకాలకు మంగళం పాడే యోచనను విరమించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుష్భుకు ఏమయ్యిందో: ఈ నిరసనకు నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్భు హాజరయ్యారు. అయితే, ఎడమ చేతి విరిగినట్టుగా ఆమె కట్టు కట్టుకుని ఉండడం, అయినా, నిరసనలో పాల్గొని, కేంద్రం తీరుపై ఆమె శివాలెత్తుతూ ప్రసంగించడం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో కుష్భు చేతికి ఏమయ్యిందో... పాపం.. అని కాంగ్రెస్ వర్గాలు సానుభూతి తెలియజేయడం విశేషం. -
ప్రతి ఇంటికొస్తా
సాక్షి, చెన్నై: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దయతో అధికార పగ్గాలు చేపట్టే ప్రభుత్వం ఏర్పడటం తథ్యం’ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులెవ్వరూ తన కోసం రావొద్దని, తానే ప్రతి ఇంటి గడప తొక్కుతాననని స్పష్టం చేశారు. రజనీ, కమల్‌కు రాజకీయాలు అవసరం లేదని, ఆ ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదన్నారు. సత్యమూర్తి భవన్ శనివారం కార్యకర్తల సందడిలో మునిగింది. ఈవీకేఎస్‌కు మద్దతు తెలిపేందుకు పెద్దఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. తంజావూరు, నాగపట్నం విల్లుపురం తదితర జిల్లా ల నుంచి తన కోసం తరలివచ్చిన వాళ్లను చూసి ఈవీకేఎస్ ఉద్వేగానికి లోనయ్యారు. తన కోసం శ్రమ పడి ఇక్కడికి రావొద్దని, ప్రతి కార్యకర్త ఇంటికి తానే స్వయంగా వస్తానని ప్రకటించారు. అనంత రం మీడియాతో ఈవీకేఎస్ మాట్లాడుతూ, రాష్ట్రం లో అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి కాంగ్రెస్‌ను బలోపేతం చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. దాడి కి ప్రతి దాడి: కాంగ్రెస్ కార్యాలయాన్ని వాసన్ మద్దతుదారులు కైవశం చేసుకోవడంపై ఆయన మాట్లాడుతూ, దాడులు, బలవంతాలు, బెదిరింపులను వాసన్ ప్రోత్సహించరని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ మార్గాన్ని ఆయన ఎంచుకుంటే, ఎదుర్కొనేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగాల్సి ఉం టుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరి బలం ఎంతోనన్న విషయం వారం రోజుల్లో తేలనుందని చెప్పారు. ఇక్కడికి వచ్చే కార్యకర్తలు, నాయకులను చూస్తుంటే, 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గా లు చేపట్టడం ఖాయం అన్న ధీమా కలుగుతోందన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ రేయింబ వళ్లు శ్రమిస్తే అధికార పగ్గాలు చేపట్టడమా, లేదా తమ దయతో రాష్ర్టంలో ప్రభుత్వం అధికారంలోకి రావడమా? అన్నది తేలిపోతుందన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా తాను పర్యటిస్తానని, ప్రతి నాయకుడి ఇంటి కి, కార్యకర్త ఇంటికి వెళ్లనున్నానని చెప్పారు. ఎన్నికల్లో నిలబడి గెలిచి పదవుల్ని చేజిక్కించుకోలేని వాళ్లంతా, ఇప్పుడు పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం హాస్యాస్పదంగా ఉందని పరోక్షంగా జీకేవాసన్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రం సంధించారు. పోరాటం : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కాబోతోందన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతోనే ఉండి, వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిశీలించే దిశగా కొత్త వ్యూహాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలు ప్రజల నడ్డి విరిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగురు తమిళుల విడుదల లక్ష్యంగా శ్రీలంకపై కొరఢా ఝుళిపించకుండా, మోదీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడం శోచనీయమన్నారు. భారత్ తలచుకుంటే, రాజపక్సేను పదవీచ్యుతుడ్ని చేయగలదని, అలాంటి చర్యలకు మోదీ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఆస్తుల్ని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, కాంగ్రెస్ ట్రస్టు నుంచి వాసన్‌ను తొలగించి జయంతి నటరాజన్, యశోదను నియమించినట్లు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మంచిదన్నారు. కమల్ కూడా రాజకీయాల్లోకి రాకూడదన్నారు. కమల్ ఎవరి ఉచ్చులోనూ అంత సులభంగా చిక్కడని, ఆయన మహా మేధావి అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు.