మోదీ రాజవంశీయుడా?’
ప్రధాని నరేంద్ర మోదీ రాజవంశీయుడిలాగా వ్యవహరిస్తూ అరగంటకో డ్రెస్ మార్చడం శోచనీయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ విమర్శించారు. పాలనపై ఆయనకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు.
సాక్షి, చెన్నై :వంద రోజుల ఉపాధి హామీ పథకంతోపాటు యూపీఏ ప్రభుత్వ పథకాలకు మంగళం పాడేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమ పథకాల్ని తుంగలో తొక్కేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. చెన్నై కలెక్టరేట్ ఆవరణలో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలో ఆందోళన చేశారు. ఈ నిరసనలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.
రాజ వంశీయుడా..: సంపన్న దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వివరిస్తూ, ఈ సమయంలో నరేంద్ర మోదీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని శివాలెత్తారు. రోజంతా ఒబామా ఒకే డ్రెస్సుతో ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ అరగంటకో డ్రె స్సులో కనిపించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకానికి ఐక్యరాజ్య సమితి సైతం కితాబిచ్చిందని గుర్తు చేస్తూ, అలాంటి పథకానికి మంగళం పాడేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో 550 డివిజన్లలో ఈ పథకం అమల్లో ఉండేదని, అయితే, ఇప్పుడు 64 డివిజన్లకు పరిమితం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. హంగు ఆర్బాటాలకే మోదీ పరిమితం అయ్యారేగానీ, ప్రజల కోసం ఆయన చేసింది శూన్యం అని ధ్వజమెత్తారు. అరగంటకో డ్రెస్సు మార్చడం కాదని, ప్రజల్లోకి వచ్చి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ పథకాలకు మంగళం పాడే యోచనను విరమించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కుష్భుకు ఏమయ్యిందో: ఈ నిరసనకు నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్భు హాజరయ్యారు. అయితే, ఎడమ చేతి విరిగినట్టుగా ఆమె కట్టు కట్టుకుని ఉండడం, అయినా, నిరసనలో పాల్గొని, కేంద్రం తీరుపై ఆమె శివాలెత్తుతూ ప్రసంగించడం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో కుష్భు చేతికి ఏమయ్యిందో... పాపం.. అని కాంగ్రెస్ వర్గాలు సానుభూతి తెలియజేయడం విశేషం.