సాక్షి, చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీకి పరుగులు తీశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశ మయ్యారు. త్వరలో ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన, రాహుల్ ప్రచార పర్యటనల కసరత్తుల మీద ఈ భేటీ సాగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. కోల్పోయిన బలాన్ని మళ్లీ చాటుకోవడం లక్ష్యంగా ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఇందు కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరికొత్త బాటలో, కొత్త వ్యూహాలతో పయనం సాగించే పనిలో పడ్డారు. అందరి కన్నా భిన్నంగా ఇంటర్వ్యూల పర్వానికి బుధవారం శ్రీకారం చుట్టించారు. అయితే, కొన్ని జిల్లాల్లో మిశ్రమ స్పందన రావడంతో రాహుల్‌కు ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో గ్రూపు రాజకీయాలతో ఆశావహుల ఇంటర్వ్యూల పర్వం మీద ప్రభావాన్ని చూపడంతో వ్యవహారం ఆగమేఘాల మీద ఢిల్లీకి చేరింది. దీంతో ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుంది. పిలుపుతో ఆయన పరుగులతో విమానం ఎక్కేశారు.
ఢిల్లీకి పరుగు : ఢిల్లీకి చేరుకున్న ఈవీకేఎస్ ఇళంగోవన్ ఉదయాన్నే రాహుల్ గాంధితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి , దరఖాస్తులు, ఆశావహుల వివరాలతో నివేదికను రాహుల్‌కు ఈవీకేఎస్ సమర్పించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన ఆదేశాల్ని ధిక్కరించే విధంగా ఇంటర్వ్యూలను బహిష్కరించిన వారి వివరాలను రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. ఎన్నికల వ్యవహారాలను వేగవంతం చేయడంతో పాటుగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందు కు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించేందుకు రాహుల్ నిర్ణయించినట్టు సమాచారం.
ఈ కమిటీలో చిదంబరం, తంగబాలుతో పాటుగా అన్ని గ్రూపుల నేతల్ని ఒకే వేదిక మీదకు తీసుకు రావడం, తన ఎన్నికల ప్రచార పర్యటన ఏ విధంగా ఉండాలో అన్న అంశాల్ని వివరించినట్టు తెలిసింది. తన తండ్రి రాజీవ్ గతంలో ఏ విధంగా పర్యటనల్ని సాగించారో, అదే తరహాలో పర్యటన సాగే విధంగా రూపకల్పనకు రాహుల్ సూచించి ఉన్నట్టుగా ఈవీకేఎస్ మద్దతు దారులు పేర్కొంటున్నారు. బహిరంగ సభల రూపంలో కన్నా, గ్రామ గ్రామాన తిరగడం ద్వారానే ఓట్లను రాబట్టవచ్చన్న కాంక్షతో రాహుల్ పర్యటన రాష్ట్రంలో సాగే అవకాశాలు ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇక, మార్చి 20వ తేదీ ద్రవిడ కళగం నేతృత్వంలో జరగనున్న ప్రజా న్యాయ మహానాడుకు హాజరు అయ్యే విషయంగా ఈ భేటీలో చర్చ సాగినట్టు చెబుతున్నారు. ఈ మహానాడుకు కరుణానిధి, బీహార్ సీఎం నితీష్‌కుమార్, లాలుప్రసాద్ యాదవ్ సైతం హాజరు కానున్న దృష్ట్యా, రాహుల్ సైతం ప్రత్యక్షం అయ్యే అవకాశాలు ఉన్నాయని, త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన, ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే కార్యక్రమాలు సాగబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఢిల్లీకి ఈవీకేఎస్
Published Fri, Feb 26 2016 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement