పుట్టినరోజు వేడుకలొద్దు
తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని నటుడు రజనీకాంత్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారంతో 63వ ఏటకు వీడుకోలు చెప్పి 64వ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. డిసెంబర్ 12 ఆయన పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆ రోజున రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఆయన అభిమానులు మాత్రం పూజలు, కటౌట్‌లకు పాలాభిషేకాలు, అన్నదానాలు, వైద్యశిబిరాలు, రక్తదానాలు అంటూ హంగామా కార్యక్రమాల్లో నిమగ్నమవడం ఆనవాయితీగా వస్తోంది.
అదే విధంగా ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రజనీకాంత్ అభిమానగణం తగిన సరంజామాతో సన్నద్ధం అవుతున్నారు. అయితే అలాంటి కార్యక్రమాలకు మన సూపర్‌స్టార్ బ్రేక్ వేశారు. కారణం అందరికీ తెలిసిందే. ఇటీవల వరదలు తమిళ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. వరదలతో తమిళనాడే జలమయమైంది. అన్నమో రామచంద్రా అంటూ ప్రజలు ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
వర్షాలు తగ్గినా జనం ఆకలి దప్పులతోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తన అభిమానులకు అలాంటి వేడుకలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ పుట్టిన రోజున తన నూతన చిత్రం ఎందిరన్-2 చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ కబాలి చిత్రంలో నటిస్తున్నారు.