నా బిడ్డను విడుదల చేయరూ!
పేరరివాలన్ తల్లి అర్బుతమ్మాల్ వేడుకోలు
సీఎం సెల్‌లో వినతి పత్రం
సాక్షి, చెన్నై:ఏళ్ల తరబడి జైళ్లో మగ్గుతున్న తనకుమాడ్ని ఇప్పటికైనా విడుదల చేయాలంటూ పేరరివాలన్ తల్లి అర్బుతమ్మా ల్ కన్నీటి పర్యంతంతో ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సీఎం సెల్‌లో బుధవారం వినతి పత్రం సమర్పించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ తదితరులకు తొలుత ఉరిశిక్ష పడ్డ విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ శిక్ష యావజ్జీవంగా మారాయి. ఓ దశలో వీరి క్షమాభిక్ష రద్దుతో ఉరిశిక్ష అమలు వరకు పరి స్థితి వెళ్లి వచ్చింది. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న తమను విడుదల చేయాలంటూ నిందితులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.
ఇందులో పేరరివాలన్ ఒకరు. ఈ కేసులో తాను నిర్దోషినైనా, 24కు సంవత్సరాలకు పైగా జీవిత కాలాన్ని జైలులోనే గడుపుతూ వస్తున్నానని పేర్కొంటూ గవర్నర్‌కు పేరరివాలన్ లేఖ రాశాడు. తమరైనా తనను విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని విన్నవించాడు. ఈ పరిస్థితుల్లో ఆ లేఖ నకలుతో పాటుగా, తన కుమారుడ్ని ఇకనైనా విడుదల చేయాలని కోరుతూ పేరరివాలన్ తల్లి అర్బుతమ్మాల్ బుధవారం సచివాలయానికి వచ్చారు. కన్నీటి పర్యంతం అవుతూ, తన బిడ్డను ఇకనైనా విడుదల చేయాలని, ఈ సంక్రాంతి పండుగ తన కుటుంబంతో ఆనందాన్ని నింపే విధంగా స్పందించాలని ప్రభుత్వాన్ని ఆమె వేడుకున్నారు.
సీఎం సెల్‌లో వినతి పత్రం సమర్పించినానంతరం మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర మనో వేదనతో, కన్నీటి పర్యంతం అవుతూ ఆమె సీఎం జయలలితను వేడుకున్నారు. తన కుమారిడి జీవితం అంతా జైలుకే పరిమితం అయిందని, ఇక నైనా అతడ్ని విడుదల చేయాలని వే డుకున్నారు. తన కుమారుడు నిర్థోషి అంటూ అప్పట్లో విచారణ జరిపిన వాళ్లు సైతం ప్రస్తుతం పెదవి విప్పుతున్నారని గుర్తు చేశారు. వయో భారంతో తాను బాధ పడుతున్నానని, తన కుమారుడికి మిగిలిన జీవితాన్ని అయినా, కుటుంబంతో గడిపే అవకాశాన్ని కల్పించాలని విన్నవించారు.