‘పెద్దల’ ఎన్నిక లాంఛనమే !
Published Wed, Jan 29 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం నుంచి రాజ్యసభకు 18 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా వీరిలో ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. ఖాళీకానున్న ఆరు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకుగాను ఈనెల 21న నామినేషన్లు ప్రారంభమయ్యూయి. అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టీ అన్నాడీఎంకే నుంచి శశికళ పుష్ప, విజిలా సత్యానంద్, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్, ఇదేపార్టీ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా టీకే రంగనాజన్, డీఎంకే నుంచి తిరుచ్చీ శివ నామినేషన్లు వేశారు. ఖాళీ అయ్యే స్థానాలకు సరిసమానంగా ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, డీఎండీకే తదితర పార్టీల నుంచి ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల గడువు పూర్తికాగా ఈనెల 29న పరిశీలన, 31వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. అదనంగా ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు కాబట్టి 31న ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు లాంఛనంగా ప్రకటిస్తారు.
రెబల్స్‌తో డీఎండీకేకు చేజారిన చాన్స్
అసెంబ్లీలో 34 ఓట్లు ఉంటే చాలు రాజ్యసభ మెట్లు ఎక్కేయవచ్చు. అన్నాడీఎంకేకు మినహా మరే పార్టీకి తగిన స్థాయిలో ఓట్లు లేవు. సంఖ్యాపరంగా 29 ఓట్లతో అధికార పార్టీ తరువాతి స్థానం డీఎండీకేది. అయితే వీరిలో ఏడు మంది ఒక్కొక్కరుగా అమ్మపంచన చేరి రెబల్స్‌గా ముద్రపడిపోయారు. మరో సీనియర్ ఎమ్మెల్యే బన్రూటి రామచంద్రన్ సైతం ఇటీవలే అన్నాడీఎంకేకు జై కొట్టారు. దీంతో కెప్టెన్ ఓట్ల బలం 21కి పడిపోయి గెలుపు అవకాశాలకు దూరమైంది. డీఎండీకే తరువాత డీఎంకేకు 23 ఓట్లు ఉన్నాయి. చిన్నాచితకా పార్టీలను కలుపుకుని కరుణానిధి మరో మూడు ఓట్లు కూడగట్టారు. మొత్తం 26 ఓట్ల బలంతో అధిక ఓట్లు కలిగిన రెండవ పార్టీగా డీఎంకే గెలుపును దక్కించుకోబోతోంది.
Advertisement