ఏకగ్రీవం!
సాక్షి, చెన్నై: రాజ్యసభకు నవనీత కృష్ణన్ ఎంపిక ఏకగ్రీవం కానున్నది. ప్రధాన పార్టీలు నామినేషన్లు దాఖలు చేయని దృష్ట్యా, ఇక ఆయన ఎంపిక లాంఛనం అయింది. శ్మశానాల్లో షెడ్డుల నిర్మాణంలో అవకతవకలు డీఎంకే ఎంపీ సెల్వగణపతి మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన తప్పుకు ఇటీవల జైలు శిక్ష పడింది. అన్నాడీఎంకే గూటి నుంచి డీఎంకే పక్షాన చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవిని దక్కించుకున్నారు. జైలు శిక్షతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఈ సీటు భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈనెల 16 నుంచి నామినేషన్లను స్వీకరిస్తూ వచ్చారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా టీఎన్‌పీఎస్సీ చైర్మన్ నవనీత కృష్ణన్‌ను సీఎం జయలలిత ప్రకటించారు. రాజ్యసభ సీటుతోపాటుగా పార్టీ న్యాయవాద విభాగం కార్యదర్శి పదవి సైతం నవనీత కృష్ణన్‌ను వరించింది. ఏకగ్రీవం : తన అభ్యర్థిత్వాన్ని సీఎం జయలలిత ఖరారు చేయడంతో ఆమె ఆశీస్సులు, మంత్రులతో కలసి నవనీత కృష్ణన్ నామినేషన్ సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పది మంది ఎమ్మెల్యేలు బల పరిచారు. ఈ సీటు తమది కావడంతో అభ్యర్థిని డీఎంకే నిలబెట్టొచ్చన్న ప్రచారం సాగింది. అయితే, ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యా బలం తక్కువగా ఉన్నందున, ఆ పార్టీ అభ్యర్థి బరిలో దిగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోని ఆ పార్టీ, మరో ఓటమిని ఎదుర్కొనేందుకు సిద్ధంగాలేదని చెప్పవచ్చు.
అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే తరపున అభ్యర్థి నామినేషన్ వేస్తారన్న సంకేతాలు ఉన్నా, ఆ పార్టీ నేత విజయకాంత్ సాహసించ లేదు. నవ నీత కృష్ణన్‌తో పాటుగా మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే, ఆ నలుగురికి ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం తథ్యం. ఇక నామినేషన్ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల తరపున అన్నాడీఎంకే అభ్యర్థి నవనీత కృష్ణన్ నామినేషన్ మాత్రం పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన పార్టీలు నామినేషన్లు సమర్పించని దృష్ట్యా, రాజ్య సభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవం కానున్నారు. ఇక ఆయన ఎన్నిక లాంఛనం కానున్నది. ఆయన ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడబోతున్నది.