
ఆన్‌లైన్‌లో అన్నా చెల్లెళ్ల పండుగ
సోదరులకు రాఖీలు పంపేందుకు ప్రత్యేక స్టోర్‌లు
రాఖీలతో పాటు స్వీట్లు, ప్రత్యేక బహుమతులు కూడా లభ్యం
బెంగళూరు: ఇప్పటి సమాజమంతా హైటెక్‌మయం. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగంతో ఇప్పుడు అన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఈ ఆన్‌లైన్ వాడకం అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌కు కూడా మినహాయింపేమీ కాదు. రాఖీ పండుగ కోసమే ప్రత్యేకంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఏర్పాటవుతున్నాయి. విదేశాల్లో ఉండే తమ సోదరుల కోసం రాఖీలను పంపాలనుకునే సోదరీమణులు కూడా ఆన్‌లైన్ ద్వారా రాఖీలను పంపేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో వేల రకాల డిజైన్లు ఈ ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉండడంతో పాటు ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో ఆన్‌లైన్‌లో రాఖీలను కొనుగోళ్లు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
బంగారు మొదలుకొని సాధారణ త్రెడ్ రాఖీ వరకు....
ప్రత్యేకంగా రాఖీల అమ్మకాల కోసమే ఏర్పాటైన ఆన్‌లైన్ స్టోర్లలో ఎన్నో వందల రకాల రాఖీలు, వేల రకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. సాధారణ తాడుతో తయారైన రాఖీ మొదలుకొని జర్దోసీ వర్క్, మీనా, కుందన్, వెండి, బంగారు పూత పూయబడిన రాఖీలు, తక్కువ ధరగల రత్నాలు పొదగబడిన రాఖీలు ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. రాఖీల డిజైన్‌లు, వాటిలో వాడిన వస్తువులను బట్టి వీటి ధర రూ.400 నుంచి ప్రారంభమై వేల రూపాయల వరకు కొనసాగుతుంది. ఇక రాఖీతో పాటు తమ సోదరులకు డ్రైఫ్రూట్స్, స్వీట్స్ పంపేందుకు కూడా ఈ ఆన్‌లైన్ స్టోర్‌లు అవకాశం కల్పిస్తున్నాయి. రాఖీతో పాటు ఇతర కానుకలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్‌లను సైతం అందజేస్తూ మహిళలను ఆకర్షిస్తున్నాయి.
తొందరగా అందుతాయనే.... ప్రపంచమే కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో చాలా మంది పైచదువులు, ఉద్యోగాలు.. ఇలా అనేక కారణాలతో విదేశాలకు వెళ్లిపోతున్నారు. అలా విదేశాల్లో ఉన్న తోబుట్టువులకు స్వయంగా వెళ్లి రాఖీ కట్టడం అనేది ప్రతి అక్కా, చె ల్లికి సాధ్యం కాని పని. అలాగని రక్షాబంధన్ రోజున తమ ప్రేమ, అనుబంధాలకు గుర్తుగా రాఖీ కట్టకపోతే ఎలా? అందుకే దేశ, విదేశాల్లో ఎక్కడున్నా సరే గంటల వ్యవధిలో రాఖీని పంపించే సౌకర్యాన్ని ఆన్‌లైన్ స్టోర్‌లు అందజేస్తున్నాయి. ఆన్‌లైన్ స్టోర్‌లు రాఖీలను వినియోగదారులకు డెలివరీ చేస్తుండడంతో ఈ ఏడాది ఆన్‌లైన్‌లో రాఖీలను పంపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది.
చెల్లెమ్మకు బహుమతులు కూడా... ఈ ఆన్‌లైన్ స్టోర్లలో అన్నదమ్ముల కోసం రాఖీలు మాత్రమే కాదు తమకు ఎంతో ఆప్యాయంగా రాఖీని పంపిన అక్కాచెళ్లెళ్ల కోసం బహుమతులు పంపేందుకు కూడా అవకాశం ఉంది. రాఖీని రక్షాబంధన్ రోజున అందజేసినట్లుగానే అక్కాచెల్లెళ్ల కోసం బుక్ చేసిన బహుమతులను సైతం రక్షాబంధన్ రోజునే అందజేస్తారు. ఈ బహుమతుల్లో కాశ్మీరీ డిజైనర్ స్టోల్స్, అందమైన హ్యాండ్ బ్యాగ్‌లు, ఆభరణాలు, దుస్తులు తదితర వస్తువులు ఆయా ఆన్‌లైన్ స్టోర్‌లు పొందుపరిచాయి. ఆన్‌లైన్ స్టోర్‌లివే.... రాఖీల అమ్మకాల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆన్‌లైన్ స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయి.