సార్వత్రిక బరిలో సినీనటులు
Published Tue, Apr 22 2014 11:03 PM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM
సాక్షి, ముంబై: ఈ నెల 24న మహారాష్ట్రలో జరుగనున్న తుది విడత ఎన్నికల్లో సినీరంగానికి చెందినవారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా గుర్తింపు పొందిన రాఖీ సావంత్ వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తున్నారు. సమాజసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ రాఖీ సావంత్ రాష్ట్రవాది ఆమ్ ఆద్మీ పార్టీ (రాప్)ని స్థాపించారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్న రాఖీ ప్రజాసేవకు ఒక్కసారీ అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన గురుదాస్ కామత్ ఎవరికీ అందుబాటులో లేరని, ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం లేదని తన ప్రచారంలో ఆమె ఆరోపిస్తున్నారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని రాఖీ సావంత్ హామీ ఇస్తున్నారు.
ఇదే నియోజకవర్గం నుంచి మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటులైన మహేష్ మాంజ్రేకర్‌ను మహారాష్ట్ర నవ నర్మాణ సేన (ఎమ్మెన్నెస్) తరఫున బరిలో దిగారు. స్థానికంగా ఎమ్మెన్నెస్ పార్టీ పటిష్టంగా ఉండడంతో మహేష్ మాంజ్రేకర్ ప్రచారంలో ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా మరాఠీ చలనచిత్ర పరిశ్రమ నిర్మాత అభిజీత్ పన్సే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజ్ ఠాక్రే ప్రభావం ఉండడంతో ఆయన కూడా ఠాణేలో సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ అభ్యర్థి సంజీవ్ నాయక్, శివసేన అభ్యర్థి రాజన్ విచారేలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఓటర్లు సినీరంగంవారిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
Advertisement