నేటి నుంచి రంజాన్ దీక్షలు
పవిత్ర పండుగ రంజాన్ మాసం ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో ప్రారంభం అయింది. నెల రోజుల పాటుగా ఈ మాసంలో పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షల్ని(రోజా) చేపడతారు. సోమవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని ముస్లింలు ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ మాసంలో ప్రత్యేక ప్రార్థనలకు నగరంలోని మసీదులు ముస్తాబయ్యూయి.
సాక్షి, చెన్నై:మహ్మద్ ప్రవక్త సూక్తుల ప్రకారం రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. ఈమాసంలో శక్తి మేరకు ఎవరైతే సత్కార్యాలు, ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారో అట్టి వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు. కాబట్టే ఇతర మాసాల్లో సైతాన్ చేయించిన పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతూ వస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం పట్ల విశ్వాసం, ఆ మాసంలో నెలకొనే భక్తి వాతావారణ ప్రభావంతో ముస్లింలు పాప కార్యక్రమాలకు దూరంగా ఉంటారు.
ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఉపవాసం ఉండకుండా అందరూ అల్లా సూచించిన మార్గంలో ఒకే రకంగా, ఒకే సమయంలో ఈ వ్రతాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ వ్రతంలో కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఆఖరుకు నోట్లో ఊరే లాలాజలాన్ని కూడా మింగకుండా ఐదు పూట్ల నమాజుతో, ఖురాన్ పఠనంతో, రాత్రుల్లో తరావీ నామాజుతో ఆరాధనలో లీనమై ఉంటారు. కఠోర ఉపవాస దీక్షను పాటించడమే కాకుండా సమష్టి సహకారంతో ఈ మాసంలో పుణ్య కార్యాలతో మరొకరికి సహాయం చేస్తూ ఉంటారు. పేద, గొప్ప తేడా లేకుండా అల్లాకు విశ్వాస పాత్రులుగా ఉంటూ సేవల్లో నిమగ్నమవుతారు. తమ శక్తి మేరకు ధాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ఈద్ ముబార్ వేళకు ముస్లింలు సన్నద్దం అవుతారు.
విందులు : మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు గల వాడిగా తీర్చిదిద్దడమే పరామర్థంగా నిలుస్తూ వస్తున్న ఈ రంజాన్ మాసం విందులకూ నెలవుగానే నిలుస్తూ వస్తున్నది. అల్లాపై భక్తి విశ్వాసాలతో పగలంతా కఠోర దీక్షలో ఉండే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ వేళ ధాన ధర్మాలే కుండా విందులు చేసుకుంటూ ఉంటారు. సహర్ సమయంలోనూ ఇదేరకంగా విందుల సందడి ఉంటుంది. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా నివశించే నగరంలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, ముడిచ్చూర్, వండలూర్, మన్నివాక్కం, తాంబరం, అరుంబాక్కం, కోడంబాక్కం, పెరంబూరు, మణివాక్కం, అన్నా సాలై పరిసర ప్రాంతాల్లో ఈ సందడిని చూడొచ్చు. ఇస్లాం మత నియమాల ప్రకారం ఉపవాస దీక్షను విరమించే సమయంలో సాత్విక లేదా మితాహారం మాత్రం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఖర్చూరం, ఇతర పండ్లతో పాటుగా మసీదులో తయారు చేసే గంజిని ఆహారంగా ఇఫ్తార్ వేళ తీసుకుంటూ వస్తారు. కొన్ని మసీదుల్లో సహారి వేళ సైతం భోజన సౌకర్యం కల్పిస్తారు. ఈ నెల రోజుల కఠోర దీక్షలో రంజాన్ పండుగకు మూడు రోజుల ముందు వచ్చే రాత్రి ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి. ఆ రోజు రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతో భక్తి భావంలోముస్లిం సోదరులు మునిగి తేలుతారు. పవిత్ర రంజాన్ కోసం కొనుగోలు చేసిన కొత్త బట్టల్ని ఈ శుభారాత్రి రోజు ధరించి ప్రార్థనలు చేస్తారు.