
అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత
తుమకూరు : అత్యాచారానికి గురైన ఓ బాలికను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన మంజునాథ (25), సునీల్ (26), మరో మైనర్ బాలుడు కొద్ది రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. ప్రస్తుతం ఆ బాలిక మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలభవన్‌లో ఆశ్రయం పొందుతోంది. కాగా, ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులకు సహకరించిన సుజాతను విచారిస్తున్నట్లు సమాచారం.