సాక్షి, న్యూఢిల్లీ: వందేళ్ల కిందట బ్రిటిష్ వారికోసం వాస్తుశిల్పి ఎడ్విన్ లూట్యెన్స్ నిర్మించిన భవనాలనే రాష్ట్రపతిభవన్, పార్లమెంటు భవనాలుగా మనం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కట్టడాలకు కొత్త సొబగులద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్ కోసం రూపొందించిన హెరిటేజ్ కన్జర్వేషన్ ప్లాన్‌ను ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరి టేజ్(ఇంటాక్) ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించింది. పార్లమెంటు భవన్ పరిరక్షణకు కూడా ఎవరైనా ఆర్కిటెక్ట్‌తో ఇటువంటి ప్రణాళిక రూపొందింపచేయాలని పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ యోచిస్తోంది. లూట్యెన్స్ బంగ్లా జోన్‌లో ఉన్న దాదాపు వెయ్యి భవనాలను క్రమానుసారం తొలగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 20 సంవత్సరాలలో ఈ భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించే ప్రతిపాదన చాలా కాలంగా ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.
గడిచిన అరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న మార్పుచేర్పులు, ఆక్రమణలు, ఏసీ ఫిట్టింగులు, ఇతర ఎలక్ట్రికల్ పనుల కారణంగా 20వ శతాబ్ది ఆరంభంలో నిర్మించిన పార్లమెంటు భవనం కూడా బాగా దెబ్బతిన్నది. ఈ భవనం ఉభయసభలకు చెందిన సభ్యుల కార్యకలాపాలతోపాటు పలు పార్టీల కార్యాలయాలు, సెక్రటేరియట్, పార్లమెంటరీ కమిటీలకు నెలవుగా ఉంది. దాంతో పాటు చెక్క పార్టిషన్‌తో రకరకాల భద్రతా పరికరాల అమరిక కారణంగా పార్లమెంటు భవనంపై భారం మరింత పెరిగింది. పార్లమెంటు భవనపు పాత డ్రాయింగు, చరిత్రను దృష్ట్టిలో ఉంచుకొని వాటి సహాయంతో భవనంలో మార్పుచేర్పులతో హెరిటేజ్ కన్జర్వేషన్ ప్లాన్ రూపొందించవలసి ఉంటుంది. అలనాటి ఈ భవనం సంరక్షణ ప్రణాళికను రూపొందించడానికి ఎంతో పరిశోధన జరపవలసి ఉంది.
పార్లమెంటు భవనంపై పడుతోన్న అదనపు భారాన్ని తగ్గించేందుకు కొన్నేళ్ల కిందట ఈ భవనానికి సమీపంలో నిర్మించిన కొత్త భవనానికి కొంతమేర తరలించారు. ఇప్పుడు ఈ భవనాన్ని విస్తరిస్తున్నారు. ఇది 2014 నాటికి అందబాటులోకి వస్తుంది. పార్లమెంటరీ కమిటీలను, పార్టీ కార్యాలయాలను ఈ భవనానికి తరలిస్తారు. గత సంవత్సరం ఎయిర్ కండిషనింగ్ సిస్టం నుంచి వెలువడిన దుర్గంధంతో రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడడంతో ఫైర్ ఆడిట్ జరిపించారు. దాంతో భవనానికి గత అరవై ఏళ్లుగా అగ్నిమాపక విభాగం నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం లభించలేదన్న విషయం వెల్లడైంది. పార్లమెంటు కోసం భవనాన్ని నిర్మించి ఇప్పుడున్న భవనాన్ని సంరక్షించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. ఫలితంగానే ఇప్పుడున్న భవనంలోనే పార్లమెంటు కార్యకలాపాలను కొనసాగిస్తూ దానిని సంరక్షించడం కోసం ప్రయత్నాలు చేయాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది.
రాష్ట్రపతి భవన్, పార్లమెంట్‌కు కొత్త సొబగులు
Published Sun, Aug 18 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement
Advertisement