చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఈనెల ఒకటో తేదీన జంట పేలుళ్లు చోటుచేసుకోవడం, అదే సమయంలో రాష్ట్రంలో పలువురు తీవ్రవాదులు పట్టుబడటం అధికారులను ఆందోళనలో పడేశాయి. పేలుళ్ల నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తలమునకలై ఉండగా విమానాశ్రయాలు, సెంట్రల్ స్టేషన్‌లోనూ, రాణీపేట పారిశ్రామికవాడలోనూ బాంబుల ప్రచారం కలకలం రేపింది. దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, మంగళూరు, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కారుబాంబు ద్వారా పేలుళ్లకు పాల్పడనున్నట్లు సమాచారం వచ్చినందున అప్రమత్తంగా ఉండాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దక్షిణ మండల సహాయ కమిషనర్ శరత్ శ్రీనివాస్ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు ఆయన అధికారిక ఆదేశాలతో ఉత్తరాలు రాశారు. ఈ ఆదేశాలతో చెన్నై విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో వేళ్లేందుకు ఉన్న రెండు మార్గాలను ఒకటిగా చేశారు. లోనికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పార్కింగ్‌లోని వాహనాలను సైతం తనిఖీ చేసి ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నాలుగు మూలలా ఎత్తై ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని బైనాక్యులర్స్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ సాగిస్తున్నారు. సివిల్ పోలీసులను నియమించి ఐదంచల బందోబస్తును ఏర్పాటు చేశారు.
సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ పోలీసు కంట్రోల్ రూముకు ఉదయం 9.30 గంటలకు ఒక ఆగంతకుడు ఫోన్ చేశాడు. ప్లాట్‌ఫాం టిక్కెట్ బుకింగ్ కౌంటర్ సమీపంలోని టాయిలెట్ల వద్ద బాంబులు అమర్చామని, వాటిని పేల్చివేసేందుకు ఇద్దరు తీవ్రవాదులు రైల్వే స్టేషన్‌లోనే ఉన్నారని చెప్పి ఫోన్ కట్‌చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకుల పరుగులతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా బాంబు డిటెక్షన్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. సుమారు మూడు గంటల పాటు సెంట్రల్ అంతా వెతికారు. ప్రయాణికులను తీవ్రంగా తనిఖీ చేసి ఏమీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆగంతకుల ఫోన్లన్నీ తాంబరం నుండి రావడంతో ఆ ప్రాంతాల్లో అనుమానితులను వెతుకుతున్నారు. వేలూరు జిల్లా రాణిపేట సిప్‌కాట్ పారిశ్రామిక వాడ బాంబు భయంతో వణికిపోయింది. సెల్‌ఫోన్ బాంబుగా అమర్చిన ఒక వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని నిర్వీర్యం చేసి పరిశోధనకు పంపారు.
రెడ్ అలర్ట్
Published Tue, May 6 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement
Advertisement