ప్రైవేటు సంస్థతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- అకౌంటెంట్, క్లర్క్ వంటి ఉద్యోగాల బాధ్యతలు అప్పగింత
- ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎంఎస్ సంస్థ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎంపీఎస్‌సీ) ద్వారా భర్తీ అయ్యే కొన్ని ఉద్యోగాలను ఇకపై ప్రైవేటు సంస్థ ద్వారా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ భర్తీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. అసిస్టెంట్, క్లర్క్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థకు ఇటీవల కాంట్రాక్టు ఇచ్చింది. దీంతో ఎంపీఎస్‌సీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, తాత్కాలిక ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. అలాగే వెనకబడిన తరగతులకు ఉద్యోగాల భర్తీలో కేటాయించిన రిజర్వేషన్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ప్రైవేటు సంస్థతో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించిన రహాస్య సమాచారం లీకయ్యే ప్రమాదం కూడా ఉంది.
పెరిగిన ఖర్చుల నేపథ్యంలో
ప్రభుత్వంపై ఖర్చులు పెరగడంతో అృవద్ధి పనులకు తీవ్ర నిధుల కొరత ఏర్పడుతోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవాలని ఇనిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా కొన్ని ఉద్యోగాలను బయట నుంచి భర్తీ చేయాలని భావించింది. అయితే ప్రైవేటు సంస్థలు డ్రైవర్, ఫ్యూన్, పారిశుద్ధ్య కార్మికులు వంటి నాలుగో శ్రేణి ఉద్యోగాల భర్తీ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో కొన్ని కీలక పదవులను భర్తీ చేసేందుకు ‘ద మహాత్మా ఫులే మల్టీ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టునిచ్చింది.
ఆ సమచారం లీకైతే..?
మంత్రాలయ పరిపాలన విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగం చాలా కీలకమైనది. చాలా కీలక విషయాలన్నీ చక్కబెట్టే బాధ్యత అసిస్టెంట్ క్లర్‌కది. పరిపాలన విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులు ముందు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఆ తర్వాతే ఇతర కార్యాలయాలకు బదిలీ అవుతాయి. మంత్రాలయకు సంబంధించిన గోప్యమైన సమాచారం ప్రైవేటు సంస్థ నియమించిన అసిస్టెంట్ నుంచి లీకైతే మొత్తం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వ సమాచారం అక్రమార్కుల చేతిలోకి వె ళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన వ్యక్తికి డిప్యూటీ కార్యదర్శి వరకు పదోన్నతి లభించే అవకాశముంటుంది. ఇప్పటివరకు ఆ స్థాయిలో పదోన్నతి లభించిన వారంతా మంత్రాలయలోనే పనిచేస్తున్నారు. అయితే వారంతా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రాలయ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తొందరపాటు చర్యల వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.