MPSC
-
అమ్మ కల
ముంబయి, మలాడ్‌లోని ఆటో డ్రైవర్ జయకుమార్ కూతురు ప్రేమా జయకుమార్ సీఏలో టాపర్. కేరళలోని మరో వ్యవసాయ కూలీ కుమార్తె సివిల్స్ లో వందలోపు ర్యాంకు సాధించింది... ఇలా ఎన్నో విజయాలను పేదింటి ఆడపిల్లలు సొంతం చేసుకున్నారు. వాసిమా షేక్ విజయం కూడా అలాంటిదే. కానీ ఇంకా వైవిధ్యమైంది. మరికొంత అందమైనది కూడా. ఆమె పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బు కోసం వాళ్లన్న ఇమ్రాన్ చదువు మానేసి ఆటో నడిపాడు. వాసిమ్ ఎమ్‌పీఎస్‌సీ (మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్)లో మంచి ర్యాంకు సాధించింది. తాను ఉద్యోగంలో చేరి వాళ్లన్నను చదివిస్తోంది. కూతురి విజయం వాసిమా షేక్ సొంతూరు మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా, జోషి సంఘ్వి. వాసిమా తల్లి వ్యవసాయ కూలీ. తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడు. కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది. పని చేసేది మాత్రం ఇద్దరే. వాసిమా తల్లి పొలంలో పని చేస్తే, అన్న ఆటో నడిపేవాడు. వాసిమా చూసిన సమాజంలో మగవాళ్లు మద్యం తాగి ఇంటికి వచ్చి ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకోవడం, నిరక్షరాస్యత, ఆడపిల్లలకు బాల్య వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. ఆడపిల్లకు చదువు చెప్పించడం అంటే డబ్బు దండగ పని అనీ, పెళ్లి చేసి పంపించేస్తే ఒక పని అయిపోతుందనే అభిప్రాయం బలంగా వేళ్లూనుకుని పోయిన సమాజంలో ఒక విప్లవ వీచిక వాసిమా తల్లి. ఆమెకు అప్పట్లోనే బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలని ఉండేది. ఆమె కల నిజం కాలేకపోయింది. నాలుగో తరగతితో చదువాపేయాల్సి వచ్చింది. కలల రెక్కలను విరిచి బాల్య వివాహంతో అత్తింట్లో అడుగుపెట్టింది. తన పిల్లలను బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగులను చేయాలని గట్టిగా నిర్ణయించుకుందామె. వాసిమా టెన్త్ క్లాస్‌లో ‘లోహా’తాలూకాతో ఫస్ట్ వచ్చింది. వాసిమా తల్లి కలలు మళ్లీ రెక్కలు విచ్చుకున్నాయి. వాసిమా చదువును కూడా హరించి వేయడానికి బంధువులు రాబందుల్లా పొడుచుకు తింటుంటే వాళ్లను ఖాతరు చేయడం మానేసిందామె. జూనియర్ కాలేజ్ కోసం ఉస్మాన్ నగర్‌కు కాలి నడకన వెళ్లింది వాసిమా. ఆ తర్వాత ‘యశ్వంత్ రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్‌యూనివర్సిటీ’ నుంచి 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఎమ్‌పీఎస్‌సీ పరీక్షలకు తనను తాను సిద్ధం చేసుకుంది. ఆమె చదువుకు కరెంటు లేదు, కోచింగ్ లేదు. రాత పరీక్షలో గట్టెక్కింది. కానీ ఇంటర్వూ్యలో విజయం రెండు మార్కుల దూరంలో ఉండిపోయింది. రెండవ ప్రయత్నంలో 2019లో నాగపూర్‌లో సేల్స్ టాక్స్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరింది. తాను ఇంటికి సహాయంగా ఉంటానని భరోసా ఇచ్చి అన్నను తిరిగి కాలేజ్‌లో చేరమని చెప్పింది. తాజా ప్రయత్నంలో వాసిమా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి అర్హత సాధించింది. వాసిమా స్ఫూర్తితో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా ఎమ్పీఎస్సీకి సిద్ధమవుతున్నారు. 2015లో వాసిమా పెళ్లి హైదర్ సాహిబ్‌తో జరిగింది, అతడు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వాసిమా విజయానికి అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అమ్మ కలను వాసిమా సాకారం చేసింది. మిగిలిన బిడ్డలు కూడా ఆ కలను సంపూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. -
ప్రైవేటు సంస్థతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - అకౌంటెంట్, క్లర్క్ వంటి ఉద్యోగాల బాధ్యతలు అప్పగింత - ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎంఎస్ సంస్థ సాక్షి, ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎంపీఎస్సీ) ద్వారా భర్తీ అయ్యే కొన్ని ఉద్యోగాలను ఇకపై ప్రైవేటు సంస్థ ద్వారా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ భర్తీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. అసిస్టెంట్, క్లర్క్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థకు ఇటీవల కాంట్రాక్టు ఇచ్చింది. దీంతో ఎంపీఎస్సీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, తాత్కాలిక ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. అలాగే వెనకబడిన తరగతులకు ఉద్యోగాల భర్తీలో కేటాయించిన రిజర్వేషన్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ప్రైవేటు సంస్థతో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించిన రహాస్య సమాచారం లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వంపై ఖర్చులు పెరగడంతో అృవద్ధి పనులకు తీవ్ర నిధుల కొరత ఏర్పడుతోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవాలని ఇనిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా కొన్ని ఉద్యోగాలను బయట నుంచి భర్తీ చేయాలని భావించింది. అయితే ప్రైవేటు సంస్థలు డ్రైవర్, ఫ్యూన్, పారిశుద్ధ్య కార్మికులు వంటి నాలుగో శ్రేణి ఉద్యోగాల భర్తీ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో కొన్ని కీలక పదవులను భర్తీ చేసేందుకు ‘ద మహాత్మా ఫులే మల్టీ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టునిచ్చింది. ఆ సమచారం లీకైతే..? మంత్రాలయ పరిపాలన విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగం చాలా కీలకమైనది. చాలా కీలక విషయాలన్నీ చక్కబెట్టే బాధ్యత అసిస్టెంట్ క్లర్కది. పరిపాలన విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులు ముందు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఆ తర్వాతే ఇతర కార్యాలయాలకు బదిలీ అవుతాయి. మంత్రాలయకు సంబంధించిన గోప్యమైన సమాచారం ప్రైవేటు సంస్థ నియమించిన అసిస్టెంట్ నుంచి లీకైతే మొత్తం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వ సమాచారం అక్రమార్కుల చేతిలోకి వె ళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన వ్యక్తికి డిప్యూటీ కార్యదర్శి వరకు పదోన్నతి లభించే అవకాశముంటుంది. ఇప్పటివరకు ఆ స్థాయిలో పదోన్నతి లభించిన వారంతా మంత్రాలయలోనే పనిచేస్తున్నారు. అయితే వారంతా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రాలయ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తొందరపాటు చర్యల వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.