బంగారం కోసం కడతేర్చారు
ప్రవాసాంధ్ర వృద్ధురాలి దారుణ హత్య
యలహంక : వృద్ధురాలిని హతమార్చి ఆమె శరీరంపై ఉన్న బంగారం, ఇంటిలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన యలహంక సమీపంలోని కామాక్షమ్మ లే ఔట్‌లో సంచలనం రేకెత్తించింది. యలహంక పోలీసుల సమాచారం మేరకు... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోన గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ(75), ఆమె భర్త లక్ష్మినారాయణ కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరుకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో యలహంకలోనే వేర్వేరు ఇళ్లలో వారు నివాసం ఉంటున్నారు.
మూడేళ్ల క్రితం లక్ష్మినారాయణ మరణించాడు. అప్పటి నుంచి ఈశ్వరమ్మ ఒంటరిగానే ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున ఇంటిలోకి దుండగులు చొరబడి ఈశ్వరమ్మను హత్య చేసి ఆమె చెవికి ఉన్న కమ్మలు, మెడలోని బంగారు చైన్, ఉంగరం, ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని బెంగళూరు సీసీబీ అడిషనల్ కమిషనర్ హరిశేఖరన్, ఈశాన్య విభాగం డీసీపీ వికాస్‌కుమార్, పోలీసులు పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.