గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరు కానుండడంతో నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరు కానుండడంతో నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ‘విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అవసరమైన చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. ఈ వేడుకల సమయంలో తమ సిబ్బంది చక్కని సమన్వయంతో ముందుకుసాగుతారని, ఇతర ఏజెన్సీలను కలుపుకుపోతామని అన్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకోనున్నాయన్నారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందన్నారు. కాగా ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో నగరంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇందుకోసం మూడు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్ట్స్ (స్వాట్) బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను... విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో వీటిని మోహరించారు. ఈ బృందాలు నిరంతరం విధుల్లో ఉంటాయి.