- నైట్ లైఫ్ పొడిగింపుపై సర్వత్రా వ్యతిరేకత
- సర్కార్ అనుమతిపై బార్లు, రెస్టారెంట్ల యజమానుల అసంతృప్తి
- క్షీణించనున్న శాంతి భద్రతలు
- టెక్కీల ఓట్ల కోసం ఎన్నికల గిమ్మిక్కా...?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో రాత్రి జీవనం (నైట్ లైఫ్)ను పొడిగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బార్లు, రెస్టారెంట్లు శుక్ర, శనివారాల్లో, హోటళ్లు, తిను బండారాల విక్రయ కేంద్రాలు వారమంతా రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారానికి రెండు రోజులే ఆయినప్పటికీ బార్లు, రెస్టారెంట్ల యజమానులు, సిబ్బంది మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు.
11 గంటల తర్వాత బార్లు, రెస్టారెంట్లకు వచ్చే వారిలో అధిక శాతం మంత్రి నేర స్వభావం కలిగిన వారై ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారంతా గొడవ పడడానికే బార్లకు వస్తుంటారని వాపోతున్నారు. యాజమాన్యాలు నిర్బంధంగా ఒంటి గంట వరకు పని చేయాలని పట్టుబడితే ప్రస్తుతం నగరంలోని బార్లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న వారిలో చాలా మంది నిలిచిపోయే అవకాశం ఉందని కోరమంగలలో ఓ బారులో పని చేస్తున్న చంద్రు తెలిపాడు. పూటుగా తాగిన వారితో తాము గొడవ పడలేమని, ఒక్కో సందర్భంలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రాత్రి వేళలను ఇలా పొడిగించడం సరికాదని అతను అభిప్రాయపడ్డాడు.
ఎన్నికల జిమ్మిక్కా...?
యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నైట్ లైఫ్ పొడిగింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని వినవస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఐటీ, బీటీ, ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి నైట్ లైఫ్‌ను పొడిగించాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, శాంతి భద్రతల దృష్ట్యా గత ప్రభుత్వాలు సమ్మతించ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది. ఇన్నాళ్లుగా లేనిది, హఠాత్తుగా ఎన్నికల సమయంలో అనుమతి ఇవ్వడానికి ఓట్లే కారణమనే విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పోలీసు శాఖ అతి కష్టం మీద జీర్ణం చేసుకోవాల్సి వస్తోంది. నైట్ లైఫ్ విస్తరణకు ఆది నుంచీ పోలీసు శాఖ అభ్యంతరం చెబుతూ వస్తోంది.
రాత్రి బీట్‌లు చూసే పోలీసు సిబ్బందికి తోడుగా 2,500 మంది హోం గార్డులను నియమిస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ ప్రకటించినప్పటికీ పోలీసు శాఖకు ఈ నిర్ణయం మింగుడు పడలేదు. ఆ శాఖను పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదనే అపవాదు రాకుండా, మూడు నెలలు ప్రయోగాత్మకంగా నైట్ లైఫ్‌ను పొడిగిస్తామని జార్జ్ చెప్పారు. అనంతరం యధావిధిగా రాత్రి 11 గంటల గడువు కొనసాగుతుందని పోలీసు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు.